రూపాయి ఇంకా బలహీనపడాలి
ఎగుమతులను కాపాడ్డానికి ఇదే మార్గమన్న ఎస్‌బీఐ చీఫ్
- చైనా నుంచీ చౌక దిగుమతులకు అడ్డుకట్ట అవసరమని సూచన...
ముంబై: భారత ఎగుమతులను కాపాడేందుకు రూపాయి మరింత బలహీనపడాల్సిన అవసరం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య సోమవారం అభిప్రాయపడ్డారు. దీనితోపాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చైనా నుంచి భారీ ఎత్తున జరుగుతున్న చౌక దిగుమతులూ ఆగాల్సి ఉంటుందని ఆమె అన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిన నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రూపాయి మరింత బలహీనపడకపోతే భారత్ ఎగుమతులకు కష్టాలు తప్పవని ఆమె ఇక్కడ ఒక వార్తా సంస్థతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
- అమెరికా డాలర్ విలువతో పోల్చితే మాత్రమే రూపాయి విలువ తగ్గింది. పలు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే పటిష్టంగానే ఉంది. పలు పోటీ దేశాల వాస్తవ ప్రభావ మార్పిడి రేటు (ఆర్‌ఈఈఆర్)తో చూస్తే, రూపాయి ఇప్పటికీ అధికంగానే ట్రేడవుతోంది.
- రూపాయి బలహీనతవల్ల స్వల్పకాలిక ఇబ్బం దులు ఉన్నా. ఎగుమతుల వృద్ధికి ఇది తప్పని పరిస్థితి. రూపాయి పటిష్టంగా ఉంటే ఎగుమతులు తగ్గడంతో పాటు చైనా నుంచి దీర్ఘకాలంలో చౌక దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది.
- ముంబైని అంతర్జాతీయ ఫైనాన్స్ సెంటర్‌గా మార్చే క్రమంలో అక్కడ పలు విభాగాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి.
- రుణ వృద్ధి జరుగుతోంది. అయితే ఇది చాలా నెమ్మదిగా ఉంది. మనం ఇంకా రెండవ త్రైమాసికంలోనే ఉన్నాం. రుణ వృద్ధి రేటు గురించి పూర్తి పరిస్థితి తెలవడానికి మిగిలిన త్రైమాసికాలూ పూర్తికావాల్సి ఉంటుంది.