
సహారా చీఫ్‌కు దక్కని బెయిల్
న్యూఢిల్లీ: బెయిల్ కోసం సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. ఇన్వెస్టర్లకు రూ.20 వేల కోట్లు వాపసు చేయడానికి సంబంధించి కొత్త ప్రతిపాదనల దాఖలులో సహారా గ్రూప్ విఫలం కావడంతో బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రస్తుతం రూ.2,500 కోట్లు చెల్లిస్తామనీ, మిగిలిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో అందిస్తామన్న సహారా ప్రతిపాదనను న్యాయస్థానం గతంలో మాదిరిగానే తిరస్కరించింది. సొమ్ము తిరిగి చెల్లించడంపై కొత్త ప్రతిపాదనతో వస్తేనే బెయిల్ అభ్యర్థనను పరిశీలిస్తామని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్‌లతో కూడిన బెంచ్ తేల్చిచెప్పింది.
బెయిల్ పిటిషన్‌పై గురువారం రెండు గంటలపాటు విచారణ కొనసాగింది. కుటుంబంతో కలసి హోలీ వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా సుబ్రతాకు బెయిల్ మంజూరు చేయాలని సహారా గ్రూప్ అడ్వొకేట్ రామ్ జెఠ్మలానీ అభ్యర్థించారు. అయితే, తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సొమ్ము చెల్లించడానికి సంబంధించి సహారా నుంచి లిఖిత పూర్వక ప్రతిపాదనలేవీ రానందున థ్యంలో బెయిల్ అభ్యర్థనను పరిశీలించజాలమని కోర్టు తేల్చిచెప్పింది.
సుబ్రతా ఈ నెల 4 నుంచి తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. హోలీని కుటుంబంతో కలసి జరుపుకునేందుకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లితో కొంత సమయం గడిపేందుకు రాయ్‌కు బెయిల్ ఇవ్వాలని జెఠ్మలానీ విన్నవించారు. ‘మీ ప్రతిపాదన ఏమిటని మేం పదే పదే అడుగుతున్నాం. మీరు ఎంత చెల్లించగలరో చెప్పండి. తాళం చెవి(సమస్యకు పరిష్కారం) మీ చేతుల్లోనే ఉంది.’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రాయ్ మాత్రమే డబ్బును సమకూర్చగలరనీ, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నందువల్ల ధన సేకరణకు సంస్థకు ఎవరూ సహాయపడరనీ జెఠ్మలానీ తెలిపారు. శుక్రవారం తన వాదనను కొనసాగించలేనని జెఠ్మలానీ అశక్తతను వ్యక్తంచేయడం, తర్వాతి వారమంతా హోలీ సెలవులు కావడంతో బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.