సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు ప్రకటిస్తుంటే సహారా గ్రూప్ తమ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్లను ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని కంపెనీ సోమవారం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు యూపీకి తిరిగివెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో స్ధానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని సహారా గ్రూప్ పేర్కొంది.
మహమ్మారి విజృంభణ తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఈ కారణంతో గ్రూపు సంస్ధల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని గట్టి నిర్ణయం తీసుకున్నామని సహారా గ్రూప్ తెలిపింది. పూర్తి భద్రతతో ఉద్యోగులందరూ తమ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. క్షేత్రస్ధాయిలో పనిచేసే 4,05,874 మంది ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించామని, 4808 మంది కార్యాలయ ఉద్యోగులకు వేతన పెంపుతో ప్రమోషన్లు కల్పించామని పేర్కొంది. తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాథికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్ధలకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment