ప్లీజ్‌: యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండి | Sahara Petitions Supreme Court To Stop Aamby Valley Auction | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌: యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండి

Published Wed, Aug 9 2017 2:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ప్లీజ్‌: యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండి - Sakshi

ప్లీజ్‌: యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండి

సహారా గ్రూపుకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్తి యాంబీ వ్యాలీ సిటీ. పుణేకు దగ్గర్లో ఉన్న ఈ ప్రాపర్టీలో లగ్జరీ రిసార్ట్స్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్నీ ఉన్నాయి. ఈ ఆస్తి మరికొన్ని రోజుల్లో సహారా చేజారిపోతుంది. దీని వదులుకోవడం ఇష్టం లేని సహారా గ్రూపు, యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండంటూ సుప్రీంకోర్టును కోరింది. యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపాలని కోరుతూ సహారా గ్రూపు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. క్యాపిటల్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ వద్ద నగదును రీఫండ్‌ చేసే విషయంలో కొంత పరిస్థితి అనుకూలించిందని సహారా పేర్కొంది. సహారా అభ్యర్థనను టాప్‌ కోర్టు త్వరలోనే విచారించనుంది. 
 
సహారాకు చెందిన యాంబీ వ్యాలీ ప్రాపర్టీని విక్రయించే ప్రక్రియను ప్రారంభించాలంటే, గత నెలలో బొంబై హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. నగదును రీఫండ్‌ చేసే విషయంలో సహారా గ్రూప్‌ తమ ఆదేశాలను పాటించకపోవడంతో సుప్రీం యాంబీ వ్యాలీని అమ్మడం ప్రారంభించాలని పేర్కొంది. అంతేకాక సెప్టెంబర్‌ 7 వరకు సెబీ వద్ద రూ.1500 కోట్లను డిపాజిట్‌ చేయాలని కూడా ఆదేశించింది. లేకపోతే తదుపరి చర్యలు చాలా సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించింది. 
 
8900 ఎకరాల్లో యాంబీ వ్యాలీ విస్తరించి ఉంది. ఈ ఆస్తి విలువ రూ.39వేల కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తొలుత యాంబీ వ్యాలీ ప్రాజెక్టును అమ్మాలని కోర్టు ఆదేశించింది. గతనెల జూలై 25న జరిగిన విచారణలో, యాంబీ వ్యాలీ వేలం ప్రక్రియను సహారా చీఫ్‌ లాయర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాలెన్స్‌ రూ.9000 కోట్లను చెల్లించడానికి 18 నెలల సమయం కోరారు.
 
సహారా గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు సహారా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సహారా హౌజింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు ఇన్వెస్టర్లకు రూ.24వేల కోట్లు చెల్లించడం విఫలయ్యాయి. ఈ కేసు కింద 2014 మార్చిలో సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతారాయ్‌ అరెస్టు అయ్యారు. అయితే గతేడాది మే నెలలో తన తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటికి వచ్చిన ఆయన, తన పెరోల్‌ గడువును ఇప్పటివరకు పొడిగించుకుంటూ పోతూనే ఉన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement