న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్ .. గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెల్లించలేమంటూ కేంద్రానికి స్పష్టం చేసింది. నగదు గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. మిగతా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రానికి సెయిల్ రూ. 2,171 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘మా దగ్గర నగదు గానీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేదు. డివిడెండ్ చెల్లించాలంటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రుణ సమీకరణ అనేది చాలా కష్టతరం. ఉక్కు పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరిన్ని రుణాలివ్వడానికి సుముఖంగా లేవు‘ అని కేంద్రానికి రాసిన వివరణ లేఖలో సెయిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాల్లో వాటాల రూపంలో రూ.1.06 లక్షల కోట్లు సమీకరిం చాలని బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కేంద్రానికి కష్టతరంగా మారనుంది. 2017–18లో కంపెనీ నష్టాల నేపథ్యంలో డివిడెండ్ చెల్లించే పరిస్థితులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment