న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ దాదాపు రూ. 5,000 కోట్లతో తలపెట్టిన ఆటోగ్రేడ్ ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం స్థలాన్ని అన్వేషిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు రాష్ట్రాల్లో అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. ‘ఆర్సెలర్ మిట్టల్‌తో కలిసి ఏర్పాటు చేసే ప్లాంటు కోసం మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సెయిల్ వర్గాలు తెలిపాయి.
ఒకటి మహారాష్ట్ర, రెండోది గుజరాత్ కాగా మూడోది ఆంధ్రప్రదేశ్‘ అని ఆయన వెల్లడించారు. ముందుగా వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఈ ప్లాంటును నిర్మిస్తారని.. ఆ తర్వాత 2.5 మిలియన్ టన్నులకు విస్తరిస్తారని ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి చెప్పారు. జాయింట్ వెంచర్ విధివిధానాలపై చర్చించేందుకు నెల రోజుల క్రితం ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మినివాస్ మిట్టల్, సెయిల్ అధికారులు సమావేశమైనట్లు ఆయన తెలిపారు. సాంకేతిక ఒప్పందాలకు సంబంధించి చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment