
సాక్షి. హైదరాబాద్: టైప్2 మధుమేహాన్ని నియంత్రించే లీరాగ్లుటైడ్ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సజ్జల బయోల్యాబ్స్ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ ఔషధంపై నొవో నార్డిస్క్‌కు ఉన్న పేటెంట్ గడువు గతేడాది సెప్టెంబరుతో ముగిసింది. దీంతో దీని జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు దేశంలో తామే మొదట ప్రయోగ పరీక్షలు ఆరంభించనున్నట్లు సజ్జల బయోల్యాబ్స్ డైరెక్టర్లు ఎస్.భార్గవ, డాక్టర్ ఎరువ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
‘‘విక్టోజా బ్రాండ్‌తో నోవో నార్డిస్క్‌కు పేటెంట్ ఉంది. ఈ పేటెంట్ గడువు ముగిసింది కనక లీరాగ్లుటైడ్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి మాకు ప్రొవిజినల్ ప్రాసెస్ పేటెంట్ దక్కింది’’ అని వారు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థను 2015లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారని తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే ఇనాక్సాపారిన్ సోడియం, లాస్పరాగైనేజ్ తదితర మందులతో గత మార్చి చివరికి రూ.15 కోట్ల టర్నోవర్ సాధించిందని, వచ్చే మార్చికి రూ.30 కోట్ల రెవెన్యూ దిశగా ముందుకెళుతున్నామని చెప్పారు. డిసెంబరు 31లోగా లీరాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment