శాంసంగ్ మడతపెట్టే ఫోన్ (ప్రతీకాత్మక చిత్రం)
సియోల్ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్తరకం ఫోన్‌ను తీసుకురాబోతుంది. అదే మడతపెట్టే ఫోన్. ఈ ఫోన్ గురించి మార్కెట్‌లో వస్తున్న రిపోర్టులు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది చివరి వరకు శాంసంగ్ మడతపెట్టే ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లాంచింగ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా శాంసంగ్ తీసుకొస్తున్న మడతపెట్టే ఫోన్, అతిపెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. భారీ ఎత్తున 7 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని తాజా రిపోర్టు పేర్కొంది. వాలెట్ మాదిరే దీన్ని మడతపెట్టుకోవచ్చని రిపోర్టు తెలిపింది. మడతపెట్టి ప్యాకెట్‌లో పెట్టుకుని మరీ ఎక్కడికైనా ఈ ఫోన్‌ను తీసుకెళ్లచ్చని రిపోర్టు పేర్కొంది.
భారీ స్క్రీన్‌తో పాటు ఈ ఫోన్‌కు ముందు వైపు రెండో డిస్‌ప్లే కూడా ఉంటుందట. ఈ రెండో డిస్‌ప్లే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యూజర్లకు నోటిఫికేషన్ల గురించి తెలియజేయడం కోసమేనని తెలిసింది. దీంతో వాట్సాప్ మెసేజ్‌లు వచ్చినప్పుడు, ఈమెయిల్స్ చదవాలనుకున్నప్పుడు హ్యాడ్‌సెట్‌ను పూర్తిగా తెరవాల్సిన పనిలేదట. అన్ని నోటిఫికేషన్లను రెండో డిస్‌ప్లే నుంచే చెక్ చేసుకోవచ్చని రిపోర్టు చెబుతోంది. ఫోన్‌కు టాప్‌లో ముందు వైపు ఈ రెండో డిస్‌ప్లేను కంపెనీ అందిస్తుంది. ‘విన్నర్’ అనే కోడ్‌నేమ్‌తో ఈ శాంసంగ్ మడతపెట్టే ఫోన్ వస్తుందని, గేమింగ్ ఔత్సాహికులను, వినియోగదారులను టార్గెట్ చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధర కూడా తక్కుమేవీ లేదట. ఇంచుమించు ఐఫోన్ ఎక్స్ మాదిరి లక్ష రూపాయల ధరను కలిగి ఉంటుందని లీకైన రిపోర్టులు చెబుతున్నాయి. తొలుత ఈ ఫోన్ పరిమిత పరిమాణంలోనే అందుబాటులో ఉంటుందట. ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌కు ఇది గట్టిపోటీగా నిలువబోతుందని టాక్. తొలుత శాంసంగ్ ఈ ఫోన్‌ను తన స్వదేశంలో లాంచ్ చేసుకుని, అనంతరం ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందట. అయితే భారత స్టోర్లలోకి ఇది వస్తుందా? రాదా? అన్నది ఇంకా క్లారిటీగా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment