ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ రికార్డు గరిష్టాల్లోకి ఎగిసింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ నిర్వహణ లాభాలు 64 శాతం పైకి జంప్ చేశాయి. బ్లాక్‌బస్టర్ సెమీ కండక్టర్ బిజినెస్‌లతో 2017లో అతిపెద్ద వార్షికాదాయాన్ని శాంసంగ్ తన సొంతం చేసుకుంది. మంగళవారం ప్రకటించిన తన క్వార్టర్లీ ఫలితాల రిపోర్టులో గతేడాది నాలుగో క్వార్టర్‌లో కంపెనీ నిర్వహణ లాభాలు 14.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిసింది. అంచనాలను మిస్ చేసినప్పటికీ లాభాల్లో మాత్రం ముందటేడాది కంటే ఎక్కువగానే సాధించింది. అదేవిధంగా కంపెనీ విక్రయాలు 24 శాతం పెరిగి, రికార్డు స్థాయిలో 61.8 బిలియన్ డాలర్లుగా నమోదుచేసినట్టు తెలిపింది. ఏడాదంతా కంపెనీ నిర్వహణాదాయం 50.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అంటే 2016 నుంచి ఇది 83 శాతం అధికం. అయితే కంపెనీ తన ప్రతి వ్యాపారాల్లోనూ తనకు వచ్చిన నికర లాభాల గణాంకాలను బహిర్గతం చేయలేదు. ఈ నెల చివరిలో పూర్తి ఆర్థిక పనితీరును కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
శాంసంగ్ సెమీ కండక్టర్లకు డిమాండ్ స్కైరాకెట్‌గా ఎగియడంతో, మెమరీ చిప్‌ల ధరలు కూడా భారీగా పెరిగాయని, దీంతో కంపెనీకి మంచి లాభాలు ఆర్జించినట్టు తెలిసింది. పిక్చర్స్, వీడియోలు, ఫైల్స్, ఇతర డిజిటల్ డేటాను యూజర్లు తమ గాడ్జెట్లు, సర్వర్లలో ఎక్కువగా స్టోర్ చేస్తున్నారని దీంతో శాంసంగ్ మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోని డ్రామ్ మెమరీ చిప్స్‌లో సగభాగం శాంసంగ్ తన ఆధీనంలో ఉంచుకుందని పేర్కొన్నాయి. డ్రామ్ చిప్ తాత్కాలికంగా డేటాను స్టోర్‌చేస్తూ.. చాలా ప్రొగ్రామ్స్‌ను రన్ చేయడానికి కంప్యూటర్లకు సహకరించనున్నాయి. 2017లో పెరిగిన మెమరీ చిప్‌ల ధరలతో అతిపెద్ద లబ్దిదారునిగా శాంసంగ్ కంపెనీనే ఉన్నట్టు తేలింది. అయితే ఈ ఏడాది చిప్‌ల ధరలు తగ్గుతాయేమోనని కొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment