విమానం మోత ! | Saudi Airlines Demanding For Huz Trips | Sakshi
Sakshi News home page

విమానం మోత !

Published Thu, Aug 9 2018 8:51 AM | Last Updated on Wed, Sep 19 2018 8:25 PM

Saudi Airlines Demanding For Huz Trips - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హజ్‌ యాత్రకు వెళ్లే ప్రయాణికులతో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు కాసుల పంట కురుస్తోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ సీజన్‌లో ధరలు రెట్టింపునకు మించి పెరిగాయి. దీంతో ఆ ఎయిర్‌లైన్స్‌కు సిరుల వరద పారుతోంది. హజ్‌ సీజన్‌లో మినహా మామూలు రోజుల్లో అప్‌ అండ్‌ డౌన్‌ విమాన టికెట్‌ చార్జీ రూ. 25 వేలు దాటదు. కాని హజ్‌ సీజన్‌లో అప్‌ అండ్‌ డౌన్‌ టికెట్‌ చార్జీ రూ. 68 వేల నుంచి రూ.72 వేలకు చేరడమే ఇందుకు ఉదాహరణ. అంటే సాధారణ రోజుల్లో తీసుకుంటున్న టికెట్‌ చార్జీల కంటే  రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నమాట. యేటా రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వం తరఫున 8 వేల మంది, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్ల ద్వారా 2 వేల మంది హజ్‌ యాత్రకు వెళుతున్నారు. ఏడాది పాటు నగరం నుంచి  ఉద్యోగులు, ఉమ్రా, విజిట్‌ వీసాలపై నిత్యం వందల మంది సౌదీ అరేబియాకు పయనమవుతున్నారు.  

గ్లోబల్‌ టెండర్‌ విధానం..సౌదీ ఎయిర్‌లైన్స్‌ పెత్తనం  
ప్రపంచ దేశాల నుంచి హజ్‌ యాత్రకు వివిధ దేశాల నుంచి యాత్రికులు సౌదీ అరేబియాకు హజ్‌ సీజన్‌లో వెళుతుంటారు. ఆయా దేశాలు తమ సొంత విమాన యాన కంపెనీల ద్వారా లేదా ఇతర దేశాల విమాన సర్వీసుల ద్వారా హజ్‌ యాత్రికులను పంపిస్తారు. సొంత విమాన సర్వీసులు లేని పక్షంలో ఆయా దేశాలు గ్లోబల్‌ టెండర్‌ విధానంతో తక్కువ టికెట్‌ ధర పలికిన లేదా కోడ్‌ చేసిన విమాన సర్వీస్‌కు హజ్‌ యాత్రికులను తీసుకెళతారు. దీంతో «టికెట్‌ ధరలు తక్కువగా ఉంటాయి.

అమలుకు నోచుకోలేదు..
హజ్‌ యాత్ర నిర్వహణ మొత్తం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ అధీనంలో ఉంటుంది. మూడే ళ్ల నుంచి హజ్‌ యాత్రికులను సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి గ్లోబల్‌ టెండర్‌ విధానాన్ని పాటించడం లేదు. లోపాయికారిఒప్పందాలతో పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని సౌదీ ఎయిర్‌లైన్స్‌కు దేశ వ్యాప్తంగా వివిధ మహానగరాల నుంచి హజ్‌ యాత్రికులకు తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తున్నారు. దీంతో సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఇష్టారీతిగా టికెట్‌ చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 

హజ్‌ యాత్రలో మోసాలు సరికాదు
హజ్‌ యాత్ర పుణ్య యాత్ర ఇందులో మోసాలకు, అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదని హజ్‌ యాత్రికులు అంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే హజ్‌ సీజన్‌లో సౌదీ విమానాల టికెట్‌ ధరలు పెంచడం సరికాదంటున్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు సౌదీ ఎయిర్‌లైన్‌ హజ్‌ యాత్ర ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వచ్చే ఏడాది హజ్‌ సీజన్‌లో విమానాల టికెట్‌ ధరలు తగ్గించేయందుకు చర్యలు తీసుకోవాలని హజ్‌ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement