అత్యుత్తమ ఉద్యోగుల ఎంపిక.. వారిలో 600 మందికి మారుతి సుజుకీ ఆల్టో, సెలరియో కార్లు, మిగిలిన వారి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఖరీదైన ఫ్లాట్లు.. ఇవన్నీ దీపావళి కానుకగా తమ సంస్థ ఎదుగుదలకు కారణమవుతున్న ఉద్యోగులకు ఓ బాస్ ఇచ్చే బహుమతులు.. ఇంతకీ అంత విశాల హృదయం ఉన్న బాస్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. మీరు ఊహించింది కరక్టే.. ఆయన మరెవరో కాదు సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్ అధినేత సావ్జి దోలకియా.
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఏటా ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు వంటి విలువైన గిఫ్ట్‌లతో ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తడం ఆయనకు అలవాటు. ఇటీవల తన కంపెనీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చి వారి శ్రమకు తగిన గుర్తింపునిచ్చారు. తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్ పాలిష్ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ మూడింటిలో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వడం విశేషం. ఇలా వారి కోరిక మేరకే 600 మందికి కార్లను, మిగతా వారి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు రాసిచ్చారు సావ్జీ దోలకియా.
ఈ జాబితాలో ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం కార్ల తాళం చెవులను అందజేశారు కూడా. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది దోలకియా ఇచ్చిన బహుమతుల విలువ కాస్త తక్కువే. కాగా 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో సూరత్ చేరుకున్న దోలకియా.. అంచెలంచెలుగా ఎదిగి వజ్రాల వ్యాపారిగా ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్ సాధించారు. మూలాలు మర్చిపోకుండా, కేవలం లాభాల కోసమే వెంపర్లాడకుండా ఉద్యోగుల బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్న సావ్జీ దోలకియా గురించి తెలుసుకుంటుంటే మనం కూడా ఆయన కంపెనీలో ఉద్యోగులమై ఉంటే బాగుండేది అన్పిస్తుంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment