Surat diamond trader
-
దీపావళి కానుకగా ఉద్యోగులకు 600 కార్లు, ఫ్లాట్లు
అత్యుత్తమ ఉద్యోగుల ఎంపిక.. వారిలో 600 మందికి మారుతి సుజుకీ ఆల్టో, సెలరియో కార్లు, మిగిలిన వారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు, ఖరీదైన ఫ్లాట్లు.. ఇవన్నీ దీపావళి కానుకగా తమ సంస్థ ఎదుగుదలకు కారణమవుతున్న ఉద్యోగులకు ఓ బాస్ ఇచ్చే బహుమతులు.. ఇంతకీ అంత విశాల హృదయం ఉన్న బాస్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. మీరు ఊహించింది కరక్టే.. ఆయన మరెవరో కాదు సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్ అధినేత సావ్జి దోలకియా. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఏటా ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు వంటి విలువైన గిఫ్ట్‌లతో ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తడం ఆయనకు అలవాటు. ఇటీవల తన కంపెనీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చి వారి శ్రమకు తగిన గుర్తింపునిచ్చారు. తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్ పాలిష్ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ మూడింటిలో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వడం విశేషం. ఇలా వారి కోరిక మేరకే 600 మందికి కార్లను, మిగతా వారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు రాసిచ్చారు సావ్జీ దోలకియా. ఈ జాబితాలో ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం కార్ల తాళం చెవులను అందజేశారు కూడా. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది దోలకియా ఇచ్చిన బహుమతుల విలువ కాస్త తక్కువే. కాగా 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో సూరత్ చేరుకున్న దోలకియా.. అంచెలంచెలుగా ఎదిగి వజ్రాల వ్యాపారిగా ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్ సాధించారు. మూలాలు మర్చిపోకుండా, కేవలం లాభాల కోసమే వెంపర్లాడకుండా ఉద్యోగుల బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్న సావ్జీ దోలకియా గురించి తెలుసుకుంటుంటే మనం కూడా ఆయన కంపెనీలో ఉద్యోగులమై ఉంటే బాగుండేది అన్పిస్తుంది కదూ. -
ఉద్యోగులకు రూ.3 కోట్ల బెంజ్ కార్లు గిఫ్ట్
సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ వారి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఐతే ఈసారి కూడా అంతే కాస్ట్లీ గిఫ్ట్‌లను తన ఉద్యోగులకు ఇచ్చాడు ఆ వ్యాపారి. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు. ఈ సీనియర్ ఉద్యోగులు కంపెనీలో చేరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీ బహుకరించారు ఆ వజ్రాల వ్యాపారి. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీ ఆన్-రోడ్డు ధర ప్రస్తుతం సూరత్‌లో కోటి రూపాయలుగా ఉంది. నీలేష్ జాదా (40), ముఖేష్ చందర్ (38), మహేష్ చంద్‌పర(43)లు చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు. డైమాండ్స్‌ను కట్ చేయడం నుంచి తమ పనిని నేర్చుకున్న ఈ ఉద్యోగులు, ప్రస్తుతం కంపెనీలో సీనియర్ ఉద్యోగులని, ఎంతో నమ్మకమైన ఉద్యోగులుగా వీరు నిలుస్తున్నట్టు దోలకియా చెప్పారు. సూరత్‌లో ఈ బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు ఈ బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. సావ్జి దోలకియా ఫోటో దోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు. అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు. కొందరికి ప్లాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇచ్చారు. ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్‌గా ఇచ్చారు. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 5500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.6000 కోట్లుగా ఉంది. 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో మాత్రమే సూరత్ వచ్చిన దోలకియా, ఇప్పుడు వజ్రాల వ్యాపారిగా రూ.6000 కోట్ల టర్నోవర్‌కు పడగెత్తారు. -
గిఫ్ట్ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు
సూరత్: తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త విభిన్నమైన ఇంక్రిమెంట్ ఇచ్చాడు. ఆర్థిక మందగమనంలోనూ మంచి ఫలితాలు సాధించినందుకు సూరత్ వజ్రాల వ్యాపారి లక్ష్మిదాస్ వెకారియా తన కంపెనీ ఉద్యోగులకు స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. 125 మందికి హోండా యాక్టివా 4జీ స్కూటర్లను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు రివార్డులు ప్రకటించేందుకు వెకారియా రూ. 50 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఆయన కంపెనీలో 5,500 మంది పనిచేస్తున్నారు. గుజరాత్ లో ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇచ్చిన రెండో వ్యాపారవేత్తగా వెకారియా నిలిచారు. గతేడాది దీపావళికి వజ్రాల ఎగుమతి వ్యాపారి సావ్జీభాయ్ ఢోలకియా తన కంపెనీ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చి ఔరా అనిపించారు. వజ్రాలను సానబెట్టి, ఎగుమతి చేయడానికి సూరత్ ప్రసిద్ధి గాంచింది.