ముంబై : రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి కనిష్ట స్ధాయిలో 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తామని వెల్లడించింది. కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించే గడువును ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించింది. ఇక ఖాతాదారులకు ఆన్‌లైన్ సేవలు అందించే తన యోనో యాప్ ద్వారా రూ 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం అందించనున్నట్టు పేర్కొంది. ఈ యాప్ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే రుణం మొత్తం వారి ఖాతాల్లోకి చేర్చనున్నట్టు తెలిపింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్యుకేషనల్ లోన్ కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గుతుందని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment