ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం రికార్డ్ తేదీ ఈ నెల 17
⇒ 10 ఎస్‌బీబీజే షేర్లకు 28 ఎస్‌బీఐ షేర్లు
⇒ 10 ఎస్‌బీటీ, ఎస్‌బీఎమ్ షేర్లకు చెరో 22 ఎస్‌బీఐ షేర్లు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో అనుబంధ బ్యాంక్‌ల విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. అనుబంధ బ్యాంక్‌ల షేర్ల స్వాపింగ్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 17ను ఎస్‌బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు విలీనం కానున్న విషయం తెలిసిందే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 28 ఎస్‌బీఐ షేర్లను పొందుతారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్‌బీటీ) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 22 ఎస్‌బీఐ షేర్లను పొందుతారు. ఈ విలీనం తర్వాత ఈ ఎస్‌బీఐ అనుబంధ బ్యాంక్‌లు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఎస్‌బీపీ, ఎస్‌బీహెచ్‌లు ఎస్‌బీఐకి పూర్తి అనుబంధ బ్యాంక్‌లు కావడం వల్ల వీటికి షేర్ల స్వాపింగ్ ఉండదు.
ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు–స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్‌బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)లు విలీనం కానున్న విషయం తెలిసిందే.