షేర్ల విభజనకు ఎస్‌బీఐ రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) షేర్ల విభజనను చేపట్టనుంది. ప్రస్తుతం రూ. 10 ముఖ విలువతో ట్రేడవుతున్న షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజించేందుకు బ్యాంకు బోర్డు నిర్ణయించింది. తద్వారా బ్యాంకు షేర్లలో లావాదేవీలు(లిక్విడిటీ) పెరిగేందుకు వీలు చిక్కుతుందని ఒక ప్రకటనలో ఎస్‌బీఐ తెలిపింది. షేర్ల విభజన నిర్ణయాన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని తెలిపింది.
రిటైలర్లతోసహా మరింత మంది ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్లలో లావాదేవీలను చేపట్టేం దుకు విభజన నిర్ణయం దోహదం చేస్తుందని బ్యాంక్ చైర్‌పర్శన్ అరుంధతీ భట్టాచార్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగి పీఈ నిష్పత్తి పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 2.7% నష్టంతో రూ. 2,487 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటికే పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు సైతం షేర్ల విభజన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.