బడ్డీలో డబ్బుల్ని ఏటీఎంలో తీసుకోవచ్చు!!
► ఒక్కొక్క లావాదేవీకి రూ.25 చార్జ్
► కొత్త సేవలకు ఎస్‌బీఐ శ్రీకారం
► రెగ్యులర్ ఏటీఎం ట్రాన్సాక్షన్ల చార్జీలు పెంచలేదని స్పష్టీకరణ
ముంబై: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్‌బీఐ’ త్వరలో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు వారి ఎస్‌బీఐ మొబైల్ వాలెట్ (బడ్డీ)లోని డబ్బుల్ని ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంక్ ప్రతి విత్‌డ్రాయల్‌కి రూ.25లను చార్జ్ చేస్తుంది.
‘కస్టమర్ తన ఎస్‌బీఐ బడ్డీలో డబ్బుల్ని కలిగి ఉంటే.. అతను వాటిని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులు బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా వాలెట్‌లో క్యాష్‌ను డిపాజిట్ చేయవచ్చు. అదే సమయంలో విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు’ అని ఎస్‌బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజనీష్ కుమార్ వివరించారు. అయితే ఈ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కి బ్యాంక్ కొంత చార్జీలను వసూలు చేస్తోంది. అవి ఎలా ఉన్నాయంటే...
► బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా వాలెట్‌లోకి రూ.1,000 వరకు క్యాష్ డిపాజిట్‌కు బ్యాంక్.. 0.25 శాతం సర్వీస్ చార్జ్‌ను (దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం) వసూలు చేస్తుంది.
► ఎస్‌బీఐ బడ్డీ నుంచి బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా రూ.2,000 వరకు క్యాష్ విత్‌డ్రాయల్‌కి 2.50 శాతం సర్వీస్ చార్జ్‌ను (దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం) వసూలు చేస్తుంది.
► ఈ సర్వీస్ చార్జ్‌లు 2017 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
► కాగా ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లు వారి బడ్డీ నుంచి బ్యాంక్ అకౌంట్లకు డబ్బుల్ని ఐఎంపీఎస్ విధానంలో ట్రాన్స్‌ఫర్ చేయడానికి సర్వీస్ ట్యాక్స్‌తోపాటు 3 శాతం సర్వీస్ చార్జ్‌ను వసూలు చేస్తోంది.
ఏటీఎం ట్రాన్సాక్షన్ల చార్జీల్లో మార్పు లేదు..
ఎస్‌బీఐ రెగ్యులర్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై సర్వీస్ చార్జ్‌లను పెంచి రూ.25కు చేయబోతోందని సోషల్ మీడియాలో వార్తలు తెగచక్కర్లు కొట్టాయి. దీంతో తేరుకున్న బ్యాంక్ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై సర్వీస్ చార్జ్‌ను ఏమాత్రం పెంచడంలేదని ఎస్‌బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజనీష్ కుమార్ తెలిపారు. తొలిగా వచ్చిన సర్క్యులర్‌లో కొన్ని తప్పులు దొర్లాయని, సరిచేసిన కొత్త సర్క్యులర్ త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.