గ్రామీణం బాగుపడితేనే...వృద్ధికి ఊతం
⇒ వ్యవసాయరంగంపై మరింత దృష్టి పెట్టాలి
⇒ ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే దాకా రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఇందుకోసం ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే నిలకడగా అధిక వృద్ధి సాధ్యపడుతుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. ఒకవైపు రుణాలకు డిమాండ్ లేకపోవడం, మరోవైపు ఇచ్చిన రుణాలు మొండిపద్దులవుతుండటం వంటి సవాళ్లను బ్యాంకులు ఎదుర్కొంటున్నాయని భట్టాచార్య వివరించారు.
ఈ రెండింటికీ సంబంధించి సమీప భవిష్యత్‌లో పరిస్థితులు మెరుగుపడే సూచనలేమీ కనిపించడం లేదని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండు సార్లు సరైన వర్షపాతం లేక కుదేలయిన వ్యవసాయ రంగానికి మరింతగా తోడ్పాటునివ్వడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. ఉత్పత్తులు దీర్ఘకాలం నిల్వ చేసుకోలేని కూరగాయల రైతులపై ఎక్కువగా పడిందని భట్టాచార్య చెప్పారు. డీమోనిటైజేషన్ జరిగిన 50 రోజుల వ్యవధిలో తమ బ్యాంక్ 89 లక్షల జన్‌ధన్ ఖాతాలు తెరిచిందని, దీంతో ఈ అకౌంట్ల సంఖ్య మొత్తం 11 కోట్లకు చేరిందని భట్టాచార్య తెలిపారు. ఈ ఖాతాల్లో రూ. 16,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయన్నారు.
వీఆర్‌ఎస్‌పై యూనియన్ల వ్యతిరేకత..
ఎస్‌బీఐలో విలీనం కానున్న 5 అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) పథకం ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని బ్యాంక్ యూనియన్లు స్పష్టం చేశాయి. ‘వారు ఎప్పుడైనా వీఆర్‌ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. సైద్ధాంతికంగా మా యూనియన్లు దీన్ని వ్యతిరేకిస్తాయి. వచ్చే రెండేళ్లలో దాదాపు 26,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారని గతంలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా వీఆర్‌ఎస్ ప్రకటించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ తన మాట తప్పుతోంది‘ అని స్టేట్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేఎస్ కృష్ణ చెప్పారు. వీఆర్‌ఎస్ అనేది అందరికీ వర్తింపచేయాలే తప్ప కేవలం అనుబంధ బ్యాంకు ఉద్యోగులకే ఎలా వర్తింపచేస్తారని ప్రశ్నించారు.