వినోద్ రాయ్, ఉర్జిత్ పటేల్, అరుంధతి
* తెరపైకి ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
* ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ కాగ్ వినోద్ రాయ్ కూడా
న్యూఢిల్లీ: రాజన్ నిష్ర్కమణ తేటతెల్లం కావడంతో ఇక ఆర్‌బీఐ తదుపరి గవర్నర్ రేసులో డజనుకుపైగా పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. రెండోసారి కొనసాగబోనని రాజన్ తేల్చిచెప్పడం..
దీన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే కొత్త గవర్నర్‌ను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, అధికారికంగా ఇంకా ఎవరిపేర్లూ బయటికి రాలేదు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐకి చేదోడుగా పటేల్ నిలిచారు. అలాగే సెప్టెంబర్‌లోనే అరుంధతీ భట్టాచార్య ఎస్‌బీఐ చీఫ్ పదవీ కాలం కూడా ముగియనుండడం గమనార్హం. ఇక 2జీ స్పెక్ట్రం స్కామ్‌ను వెలుగులోకితెచ్చిన రాయ్.. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో(బీబీబీ)కు నేతృత్వం వహిస్తున్నారు.
ఇతర ముఖ్యుల్లో...: రేసులో ఉన్న ఇతర వ్యక్తుల్లో ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత్ దాస్, ఆర్థిక మంత్రి మాజీ సలహదారు పార్థసారథి షోమ్, బ్రిక్స్ బ్యాంక్ హెడ్, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్, సెబీ చైర్మన్ యూకే సిన్హా ఉన్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఇంకా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్ణ్, మాజీ ఆర్థిక కార్యదర్శి విజయ్ కేల్కర్, మాజీ సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లాహిరి పేర్లు ప్రభత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇతర నియంత్రణ సంస్థలకు చీఫ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే పద్ధతిని ఆర్‌బీఐ చీఫ్ నియామకానికి ఎప్పుడూ అవలంభించడం లేదు. తదుపరి గవర్నర్‌కు అభ్యర్ధుల జాబితాను తయారుచేసే బాధ్యతను ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్ సెర్చ్ కమిటీకి అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీకి కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా నేతృత్వం వహిస్తున్నారు.