PK Sinha
-
వైదొలిగిన ‘ప్రిన్సిపాల్ సెక్రటరీ’ మిశ్రా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు. 1967 బ్యాచ్ ఐఏ ఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు. కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్డీగా ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది. -
గుడ్‌బై.. ఎయిరిండియా!!
న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఎసాప్స్ కోసం అయిదు శాతం వాటాలు మాత్రమే అట్టే పెట్టుకుని మిగతా 95 శాతాన్ని విక్రయించేసేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ పి.కె. సిన్హా సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సులకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విక్రయం ఎప్పుడు చేపట్టాలి, ఎన్ని షేర్లు విక్రయించాలి, డీల్ ఎంత స్థాయిలో ఉండాలి అన్న అంశాలపై హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్ తొలి వారంలోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ)ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ప్రతిపాదనలు ఇలా.. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం నుంచి ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు దాకా ఎయిరిండియాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది. గతంలో ఎయిరిండియా విక్రయానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషించుకుని, తగు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం 24 శాతం వాటాలను తన దగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని విక్రయ ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరించిన ఈవై సంస్థ పేర్కొనడంతో ఏకంగా 95 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇక, వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు.. కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధి లేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. గతంలో సెంటార్ హోటల్ విక్రయం విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతల కారణంగా ఎయిరిండియా వాటాల అమ్మకంలో మూడేళ్ల లాకిన్ వ్యవధి నిబంధనను గత ప్రతిపాదనల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెంటార్ హోటల్‌ను కొనుగోలు చేసిన టులిప్ హాస్పిటాలిటీ సర్వీసెస్.. దాన్ని నిర్వహించే ప్రయత్నాలేమీ చేయకుండా ఆ వెంటనే మరింత అధిక ధరకు దాన్ని అమ్మేసేయడాన్ని కాగ్ తప్పుపట్టింది. ఇలాంటివి మళ్లీ తలెత్తకుండా ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలో లాకిన్ వ్యవధిని చేర్చాల్సి వచ్చింది. అయితే, అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కొనుక్కున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు అని తెలిపాయి. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని లాకిన్ వ్యవధి నిబంధనను పక్కన పెట్టనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. అంతే కాకుండా కొనుగోలుదారు తన ప్రస్తుత వ్యాపారంలో ఎయిరిండియాను విలీనం చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించేలా నిర్దిష్ట నిబంధనను కూడా సడలించనున్నారు. ముచ్చటగా మూడోసారి.. ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఒకసారి, మళ్లీ 2018లో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో.. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తోంది. ఆర్థిక సంక్షో భంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేం దుకు కేంద్రం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,465 కోట్లు, 2017–18లో రూ.1,800 కోట్లు, 2018–19లో రూ. 3,975 కోట్ల మేర నిధులు సమకూర్చింది. గోప్యంగా సమాలోచనలు... ప్రస్తుత విధానాలకు భిన్నంగా ఎయిరిండియాను కొనుగోలు చేసే అవకాశాలున్న సంస్థలతో ఒక చిన్నపాటి ప్రభుత్వాధికారుల బృందం నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. కొనుగోలుకు ఆశక్తిగా ఉన్న ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకుని ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ సమాలోచనలన్నీ గోప్యంగా జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వరకూ విక్రయ ప్రక్రియపై ప్రభుత్వ వర్గాల ప్రభావమేదీ పడకుండా చూసేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే, పెద్ద మొత్తంలో బిడ్ చేస్తున్నప్పుడు సీఈవో లేదా సీఎఫ్వోల్లాంటివారు కాకుండా ప్రమోటరు స్థాయిలో ఉన్న వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రమోటర్లు నేరుగా విక్రేతతోనే సంప్రదింపులు జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టే కీలకమైన కొంత మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఈ చర్చల్లో భాగం చేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. -
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్రో టెక్నాలజీ!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాలను పరుగులు పెట్టించేందుకు వీలుగా ఓ కీలకమైన సూచనను ఆర్థిక శాఖ కార్యదర్శి పి.కె.సిన్హా నేతృత్వంలోని కమిటీ కేంద్రం ముందుంచింది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన లిథియం అయాన్ బ్యాటరీల టెక్నాలజీని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతించాలన్నదే ఆ సూచన. అలాగే, వాహనాల బ్యాటరీల చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌తో కలసి విద్యుత్ శాఖ విద్యుత్ చార్జీలను, అనుసంధాన విధానాలను నిర్ణయించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ‘‘తగిన అమమతుల అనంతరం ఇస్రో లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద వివక్షకు తావులేని వాణిజ్య అవసరాలకు అనుమతించే అంశాన్ని పరిశీలించాలి’’ అని ఈ కమిటీ సూచించింది. ప్రస్తుతం దేశంలో వాణిజ్య ప్రాతిపదికన లిథియం అయాన్ బ్యాటరీలు తయారవడం లేదు. వీటిని జపాన్, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశ చమురు అవసరాలకు ప్రస్తుతం ఏటా రూ.7 లక్షల కోట్లను వెచ్చించాల్సి వస్తుండడంతో, ఎలక్ట్రికల్ వాహనాల వినియోగా న్ని పెంచడం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టడంతోపాటు, దిగుమతుల బిల్లును తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. -
తగ్గిన సెయిల్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గాయి. గత క్యూ2లో రూ.732 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.539 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,080 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.13,442 కోట్లకు పెరిగాయని సెయిల్ చైర్మన్ పి.కె. సిన్హా చెప్పారు. అధిక విలువ ఉన్న ఉత్పత్తుల వాటా పెంచుకోవడంపై దృష్టి సారించామని, నిర్వహణ వ్యయాల తగ్గింపుపై కూడా దృష్టి పెట్టామని, పటిష్టమైన ఆర్థిక నిర్వహణ, సమర్థవంతమైన ఉత్పత్తి కార్యకలాపాలు. ఇవన్నీ మంచి ఫలితాలనిస్తున్నాయని వివరించారు. ఈ క్యూ2లో విక్రయం కాగల ఉక్కు ఉత్పత్తి 3.659 మిలియన్ టన్నులకు చేరిందని, తమ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్లో ఈ స్థాయి ఉత్పత్తి జరగడం ఇదే రికార్డని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 1.7 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. -
షరతులతో ‘బడ్జెట్’కు ఈసీ అనుమతి
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పథకాలు, హామీలు ప్రకటించకూడదని సూచించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ విజయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు ఉండకూడదంది. 2009లో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించింది. ‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే ప్రక్రియకు విఘాతం కల్పించకుండా.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రకటనా లేకుండా బడ్జెట్ ఉండాలని ఆదేశిస్తున్నాం’ ఎన్నికల సంఘం కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాకు తెలిపింది. -
అమ్మో వాటర్ ట్యాంకుల్లో ఇన్ని ప్రాణాంతక దోమలా!
న్యూఢిల్లీ : చికెన్ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులతో విల్లవిల్లలాడుతున్న దేశానికి మరో షాకింగ్ న్యూస్. 86 శాతం ప్రాణాంతక దోమలు మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్టు ప్రభుత్వ స్టడీ గుర్తించింది. కుటుంబాలు మంచినీళ్లు నిలువ ఉంచుకునేందుకు టెర్రస్ పైన ఏర్పాటుచేసుకునే ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కంట్రక్షన్ సైట్లలోనే ఎక్కువగా దోమలను ఉన్నట్టు ప్రభుత్వం రిపోర్టు పేర్కొంది. దోమ కాటుతో చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధులపై పోరాట నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టు తయారుచేసింది. మంచి పారిశుద్ధ్యం, సమర్థవంతమైన అవగాహన, కమ్యూనికేషన్ కాంపెయిన్ల వల్ల ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని రిపోర్టు సూచించింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు అధికారిక తాజా డేటా పేర్కొంటోంది. ఈ కేసులు వచ్చే రెండు నెలల్లో మరింత పెరుగనున్నట్టు తెలిపింది.. ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం, డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కంట్రక్షన్ సైట్స్‌లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ప్రాణాంతక దోమలున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంపై సీరియస్‌గా స్పందించిన ఆరోగ్య కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విజృంభిస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా కేసులను నిర్మూలించడానికి, నిరోధించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ అథారిటీలు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొబైల్ క్లినిక్స్‌ను వాడుకోవాలని, మెడిసిన్లు, డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే వారం ఈ వ్యాధుల నివారణపై ప్రభుత్వం డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు సిన్హా తెలిపారు. -
వారసుడి రేసులో డజను పేర్లు...
* తెరపైకి ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య * ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ కాగ్ వినోద్ రాయ్ కూడా న్యూఢిల్లీ: రాజన్ నిష్ర్కమణ తేటతెల్లం కావడంతో ఇక ఆర్బీఐ తదుపరి గవర్నర్ రేసులో డజనుకుపైగా పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. రెండోసారి కొనసాగబోనని రాజన్ తేల్చిచెప్పడం.. దీన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే కొత్త గవర్నర్‌ను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, అధికారికంగా ఇంకా ఎవరిపేర్లూ బయటికి రాలేదు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐకి చేదోడుగా పటేల్ నిలిచారు. అలాగే సెప్టెంబర్‌లోనే అరుంధతీ భట్టాచార్య ఎస్బీఐ చీఫ్ పదవీ కాలం కూడా ముగియనుండడం గమనార్హం. ఇక 2జీ స్పెక్ట్రం స్కామ్‌ను వెలుగులోకితెచ్చిన రాయ్.. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో(బీబీబీ)కు నేతృత్వం వహిస్తున్నారు. ఇతర ముఖ్యుల్లో...: రేసులో ఉన్న ఇతర వ్యక్తుల్లో ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత్ దాస్, ఆర్థిక మంత్రి మాజీ సలహదారు పార్థసారథి షోమ్, బ్రిక్స్ బ్యాంక్ హెడ్, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్, సెబీ చైర్మన్ యూకే సిన్హా ఉన్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్ణ్, మాజీ ఆర్థిక కార్యదర్శి విజయ్ కేల్కర్, మాజీ సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లాహిరి పేర్లు ప్రభత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇతర నియంత్రణ సంస్థలకు చీఫ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే పద్ధతిని ఆర్బీఐ చీఫ్ నియామకానికి ఎప్పుడూ అవలంభించడం లేదు. తదుపరి గవర్నర్‌కు అభ్యర్ధుల జాబితాను తయారుచేసే బాధ్యతను ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సెర్చ్ కమిటీకి అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీకి కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా నేతృత్వం వహిస్తున్నారు.