న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గాయి. గత క్యూ2లో రూ.732 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.539 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,080 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.13,442 కోట్లకు పెరిగాయని సెయిల్ చైర్మన్ పి.కె. సిన్హా చెప్పారు.
అధిక విలువ ఉన్న ఉత్పత్తుల వాటా పెంచుకోవడంపై దృష్టి సారించామని, నిర్వహణ వ్యయాల తగ్గింపుపై కూడా దృష్టి పెట్టామని, పటిష్టమైన ఆర్థిక నిర్వహణ, సమర్థవంతమైన ఉత్పత్తి కార్యకలాపాలు. ఇవన్నీ మంచి ఫలితాలనిస్తున్నాయని వివరించారు. ఈ క్యూ2లో విక్రయం కాగల ఉక్కు ఉత్పత్తి 3.659 మిలియన్ టన్నులకు చేరిందని, తమ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్లో ఈ స్థాయి ఉత్పత్తి జరగడం ఇదే రికార్డని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెయిల్ షేర్ 1.7 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment