న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఎసాప్స్ కోసం అయిదు శాతం వాటాలు మాత్రమే అట్టే పెట్టుకుని మిగతా 95 శాతాన్ని విక్రయించేసేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ పి.కె. సిన్హా సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సులకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విక్రయం ఎప్పుడు చేపట్టాలి, ఎన్ని షేర్లు విక్రయించాలి, డీల్ ఎంత స్థాయిలో ఉండాలి అన్న అంశాలపై హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్ తొలి వారంలోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ)ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి.
ప్రతిపాదనలు ఇలా..
కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం నుంచి ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు దాకా ఎయిరిండియాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది. గతంలో ఎయిరిండియా విక్రయానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషించుకుని, తగు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం 24 శాతం వాటాలను తన దగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని విక్రయ ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరించిన ఈవై సంస్థ పేర్కొనడంతో ఏకంగా 95 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాలని కేంద్రం భావిస్తోంది.
ఇక, వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు.. కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధి లేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. గతంలో సెంటార్ హోటల్ విక్రయం విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతల కారణంగా ఎయిరిండియా వాటాల అమ్మకంలో మూడేళ్ల లాకిన్ వ్యవధి నిబంధనను గత ప్రతిపాదనల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెంటార్ హోటల్‌ను కొనుగోలు చేసిన టులిప్ హాస్పిటాలిటీ సర్వీసెస్.. దాన్ని నిర్వహించే ప్రయత్నాలేమీ చేయకుండా ఆ వెంటనే మరింత అధిక ధరకు దాన్ని అమ్మేసేయడాన్ని కాగ్ తప్పుపట్టింది.
ఇలాంటివి మళ్లీ తలెత్తకుండా ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలో లాకిన్ వ్యవధిని చేర్చాల్సి వచ్చింది. అయితే, అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కొనుక్కున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు అని తెలిపాయి. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని లాకిన్ వ్యవధి నిబంధనను పక్కన పెట్టనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. అంతే కాకుండా కొనుగోలుదారు తన ప్రస్తుత వ్యాపారంలో ఎయిరిండియాను విలీనం చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించేలా నిర్దిష్ట నిబంధనను కూడా సడలించనున్నారు.
ముచ్చటగా మూడోసారి..
ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఒకసారి, మళ్లీ 2018లో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో.. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తోంది. ఆర్థిక సంక్షో భంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేం దుకు కేంద్రం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,465 కోట్లు, 2017–18లో రూ.1,800 కోట్లు, 2018–19లో రూ. 3,975 కోట్ల మేర నిధులు సమకూర్చింది.
గోప్యంగా సమాలోచనలు...
ప్రస్తుత విధానాలకు భిన్నంగా ఎయిరిండియాను కొనుగోలు చేసే అవకాశాలున్న సంస్థలతో ఒక చిన్నపాటి ప్రభుత్వాధికారుల బృందం నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. కొనుగోలుకు ఆశక్తిగా ఉన్న ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకుని ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ సమాలోచనలన్నీ గోప్యంగా జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వరకూ విక్రయ ప్రక్రియపై ప్రభుత్వ వర్గాల ప్రభావమేదీ పడకుండా చూసేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే, పెద్ద మొత్తంలో బిడ్ చేస్తున్నప్పుడు సీఈవో లేదా సీఎఫ్‌వోల్లాంటివారు కాకుండా ప్రమోటరు స్థాయిలో ఉన్న వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రమోటర్లు నేరుగా విక్రేతతోనే సంప్రదింపులు జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టే కీలకమైన కొంత మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఈ చర్చల్లో భాగం చేసినట్లు అధికార వర్గాలు వివరించాయి.
గుడ్‌బై.. ఎయిరిండియా!!
Published Sat, Aug 17 2019 4:58 AM | Last Updated on Sat, Aug 17 2019 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment