
న్యూఢిల్లీ: నీరవ్ మోడీ స్కామ్‌కు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టుకోగలమని ఎస్‌బీఐ ధీమా వ్యక్తంచేసింది. పీఎన్‌బీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) ఆధారంగా తామిచ్చిన 212 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,360 కోట్లు) ఆ బ్యాంకు తిరిగి చెల్లిస్తుందని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. తమ వంతుగా తమకు రావాల్సిన మొత్తాలను లెక్కవేసి పీఎన్‌బీకి ఇప్పటికే తెలియజేశామని కుమార్ చెప్పారు.
‘‘స్కామ్ మిగతా బ్యాంకులకు విస్తరించకుండా కేవలం పీఎన్‌బీకే పరిమితమవుతుందనే నమ్మకం ఉంది. ఒకవేళ అలాంటిదేదైనా ఉండి ఉంటే ఇప్పటికే బైటికొచ్చేసి ఉండేది. మిగతా బ్యాంకులు ఈ పాటికే తమ పోర్ట్‌ఫోలియోలను సమీక్షించుకుని ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నగదు బదిలీకి ఉపయోగించే స్విఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించే విషయంలో తగు భద్రతా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాలను ఏప్రిల్ నాటికల్లా బ్యాంకులు పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉందని రజనీష్ కుమార్ తెలిపారు.
పీఎన్‌బీ స్కామ్ నిర్వహణపరమైన రిస్కుల వల్ల తలెత్తినదే తప్ప.. రుణాల మంజూరుపరమైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌వోయూలను ఉపయోగించుకుని వజ్రాభరణాల డిజైనర్ నీరవ్ మోడీ సంస్థలు దాదాపు రూ. 11,400 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన స్కాం సంగతి తెలిసిందే.