డిపాజిట్లలో 40% మావద్దే!
• డిజిటల్ చొరవ కొనసాగితేనే ఆశించిన ప్రయోజనం
• ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య
దావోస్: నోట్ల రద్దు అనంతరం తమ బ్యాంకులో జమ అయిన డిపాజిట్లలో 15 నుంచి 40 శాతం వరకు ఉండిపోతాయన్న అంచనాను ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల సందర్భంగా అరుంధతి భట్టాచార్య ఓ ప్రముఖ టెలివిజన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘డిపాజిట్లలో అధిక మొత్తం వ్యాపారస్తుల నుంచి వచ్చి ఉంటే, వారు తిరిగి తమ వ్యాపార అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. కానీ, ఒకవేళ బ్యాంకుల్లోకి వచ్చిన నగదు జమల్లో అధిక శాతం ప్రజల పొదుపు (ఇళ్లలో దాచుకున్న నగదు) అయితే అవి అలానే కొనసాగుతాయి’’ అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
నగదుకు బదులుగా డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి చేపట్టిన చర్యలను కొనసాగించాల్సి ఉందన్నారు. ఒకవేళ తిరిగి డీమోనిటైజేషన్ ముందునాటి పరిస్థితులకు వెళ్లితే ఆశించిన ప్రయోజనాలను పొందలేమని చెప్పారు. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లోకి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ భారీ నిల్వలతో బ్యాంకులు లబ్ధి పొందుతాయన్న విశ్లేషణల నేపథ్యంలో అరుంధతి భట్టాచార్య మాటలకు ప్రాధాన్యం నెలకొంది.
రుణాలుగా మళ్లించడం ద్వారానే ప్రయోజనం
‘‘బ్యాంకుల్లో గరిష్ట స్థాయిలో డిపాజిట్లు కొనసాగడం అంటే వాటికి తక్కువ వ్యయానికే నిధులు అందుబాటులో ఉన్నట్టు. వీటిని రుణ వితరణ చేయడం ద్వారా బ్యాంకులు లాభపడతాయి’’ అని సెంట్రమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ అనలిస్ట్ పాయల్ పాండ్యా తెలిపారు. బ్యాంకులు తమ దగ్గరున్న డిపాజిట్లను సాధ్యమైనంత త్వరగా రుణాలుగా మళ్లించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎస్‌బీఐలో డిపాజిట్లు రూ.1.4 లక్షల కోట్లు పెరగ్గా... అదే సమయంలో కంపెనీ లోన్ బుక్ సైతం తగ్గింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రుణాల జారీ 9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు భట్టాచార్య ఈ నెలారంభంలో రుణాల రేట్ల తగ్గింపు సందర్భంగా వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఇది 6.7 శాతంగా ఉన్నట్టు తెలిపారు.
ప్రభుత్వం నుంచి మరో 1,894 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు మూలధనంగా మరో రూ.1,894 కోట్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం గత ఏడాది జూలై 19న ఒక ప్రకటన చేస్తూ... ఎస్‌బీఐకి రూ.7,575 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపింది. ఇందులో 75 శాతాన్ని విడుదల చేసింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐఓబీలుసహా 13 ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి రుణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తూ... ఇప్పటివరకూ రూ.22,915 కోట్లను కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అందించింది.