ఉబెర్తో ఎస్బీఐ జట్టు
ముంబై: ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తాజాగా ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉబెర్ ప్లాట్‌ఫామ్‌లోని ‘డ్రైవర్ పార్ట్‌నర్స్’కు తక్షణ రుణ సదుపాయం కల్పించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. డ్రైవర్లకు రుణాలను కేవలం ఒకే రోజులో మంజూరు చేస్తామని, వడ్డీ రేట్లు కూడా అందుబాటు స్థాయిలోనే ఉంటాయని ఎస్‌బీఐ తెలిపింది. అన్ని రుణాలకు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం వర్తిస్తుందని పేర్కొంది. దేశంలో ట్రాన్స్‌పోర్ట్ విభాగం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశమని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అలాగే ఎస్‌బీఐ పదవీ విరమణ చేసిన సైనిక ఉద్యోగులకు ఎంట్రపెన్యూరియల్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా ఆర్మీ వెల్‌ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.