యాంబీ వ్యాలీని వేలం వేయండి
♦ నిర్దేశిత రూ.5వేల కోట్లు డిపాజిట్ చేయనందుకు ఇది తప్పదు
♦ సహారా గ్రూప్‌నకు సుప్రీంకోర్టు ఆదేశం
♦ 28న వ్యక్తిగతంగా హాజరవ్వాలని సుబ్రతా రాయ్‌కి ఆదేశాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సహారాకు చెందిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీని వేలం వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 17లోగా సెబీ– సహారా రీఫండ్ అకౌంట్లో రూ.5,092.6 కోట్లు జమ చేయాల్సిందేనని, ఇందుకు సంబంధించి గడువు పొడిగించే ప్రసక్తే లేదని సహారా గ్రూప్‌నకు గత నెలన్నరగా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ వస్తోంది. ఒకవేళ నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో దాదాపు రూ. 34,000 కోట్లు విలువ చేసే సహారా గ్రూప్ ప్రాజెక్టు ’యాంబీ వ్యాలీ’ని వేలం వేయాలంటూ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించింది. అయితే గడువు పెంపునకు సహారా వేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం ఈ నెల 7న తోసిపుచ్చింది. అంతక్రితం ఫిబ్రవరి 6న యాంబీ వ్యాలీ జప్తునకు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
కోర్టు ఉత్తర్వులతో ఆటలొద్దు..!
యాంబీ వ్యాలీని వేలం వేయాలని, ఈ అంశంపై ప్రత్యక్షంగా తనకు రిపోర్ట్ చేయాలని బాంబే హైకోర్డ్ అధికార లిక్విడేటర్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా హాజరవ్వాలని కూడా సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కు జస్టిస్ దీపక్ మిశ్రా, రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో ఆటలు వద్దని సైతం ధర్మాసనం రాయ్‌ని హెచ్చరించింది. 48 గంటల్లోగా ఆస్తులకు సంబంధించిన వివరాలన్నిటినీ అధికారిక లిక్విడేటర్‌కు అందజేయాలని సహారా, ఆ గ్రూప్ చీఫ్ రాయ్ అలాగే సెబీలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లు తిరిగివ్వాల్సిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీతోసహా ఈ మొత్తం రూ.37,000 కోట్లుగా సెబీ పేర్కొంటోంది. ఈ కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో గడిపిన రాయ్, తల్లి మరణం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా కొంత మొత్తాలు డిపాజిట్ చేస్తూ, ‘పెరోల్ పొడిగింపు’ ఉత్తర్వులు పొందుతున్నారు.