చైనా కరెన్సీ క్షీణత ఆందోళనకరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చైనా కరెన్సీలో క్షీణత భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర వాణిజ్య, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి రవ్‌నీత్ కౌర్ చెప్పారు. మూడేళ్లుగా మనదేశ ఎగుమతులు క్షీణిస్తుండటం ఆందోళనకరమైన అంశమని ఆమె అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సులో సోమవారం ‘మేకిన్ ఇండియా - గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ స్ట్రాటజీ’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో రవ్‌నీత్ కౌర్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో తగిన స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు.
35 తయారీరంగ అంశాల్లో మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్‌లో బలీయ శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. ‘మేకిన్ ఇండియా’ అంశంపై ఫిబ్రవరిలో ముంబైలో గ్లోబల్ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోల్స్‌రాయిస్ ఇండియా ప్రై లిమిటెడ్ ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ మాట్లాడుతూ తమ సంస్థ వాహనాలను పూర్తిగా భారత్‌లో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
అందుకు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. దేశ స్థూల ఉత్పత్తిలో తయారీ రంగం వాటాను 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడానికి ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం దోహదపపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫోల్గర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను దేశీయంగా తయారు చేయడానికి భారతదేశం అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లేకపోతే 2029నాటికి భారత ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల దిగుమతులు క్రూడాయిల్ దిగుమతులను అధిగమించే అవకాశం ఉందన్నారు. తమ సంస్థ ఏడాదిలో దేశంలో 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు.
ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ రంగం 2029నాటికి 1.50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదుగుతుందని ఆయన చెప్పారు. అమెరికాకు చెందిన పాటన్ బోగ్స్ సంస్థ అంతర్జాతీయ సలహాదారు ఫ్రాంక్ జి.విస్‌నర్ మాట్లాడుతూ భారత ఎగుమతులు మూడేళ్లుగా క్షీణిస్తుండటం ఆందోళనకరమన్నారు. భారత్‌లో భూమి, పన్ను, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ చర్చాగోష్టిలో దివీస్ లేబరేటరీస్ ఎండీ కిరణ్ ఎస్. దివి తదితరులు పాల్గొన్నారు.