మాల్యాపై సెబీ వేటు..
సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం
♦ యునైటెడ్ స్పిరిట్స్ నిధుల మళ్లింపు కేసులో ఆదేశాలు
♦ మరో ఆరుగురిపైనా ఇదే చర్య
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణల కేసులో విజయ్ మాల్యా, మరో ఆరుగురిని సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు లేదా సెక్యూరిటీలకు సం బంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధమైన లావాదేవీలు జరపకుండా వారిపై వేటు వేసింది. అలాగే, విజయ్‌మాల్యాతోపాటు యునైటెడ్ స్పిరిట్స్ మాజీ ఉన్నతాధికారి అశోక్ కపూర్‌ను ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్, కీలకమైన నిర్వహణ పదవులు చేపట్టకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని సెబి తెలిపింది. సెబీ నిషేధానికి గురైన వారిలో అశోక్ కపూర్, పీఏ మురళి, సౌమియా నారాయణన్, ఎస్‌ఎన్ ప్రసాద్, పరంజిత్ సింగ్ గిల్, ఐనాపూర్ ఎస్‌ఆర్ ఉన్నారు.
ఈ కేసులో ఉల్లంఘనలు తీవ్రమైనవి
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్, చైర్మన్ పదవుల నుంచి గతేడాది మార్చిలో విజయ్ మాల్యా వైదొలిగారు. దానికంటే ముందు యునైటెడ్ స్పిరిట్స్ నుంచి మాల్యా అక్రమంగా నిధులు తరలించారని, అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సెబీ విచారిస్తోంది. ‘‘ఈ కేసులో బయటపడిన ప్రాథమిక ఉల్లంఘనలు చాలా తీవ్రమైనవి. సెక్యూరిటీల మార్కెట్ సమగ్రతకు, భద్రతకు సమస్యాత్మకమైనవి. ఈ వ్యక్తులు (మాల్యా, ఇతరులు) మోసపూరితంగా రూపొం దించిన ఖాతా పుస్తకాల ఆధారంగానే పెట్టుబడి దారులు తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. ఈ చర్యలు సెక్యూరిటీల మార్కెట్ ప్రయోజనాలకు గానీ, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు గానీ అనుకూలంగా లేవు’’ అని సెబీ పూర్తి స్థాయి సభ్యుడైన ఎస్ రామన్ ఆదేశాల్లో పేర్కొన్నారు.