‘మిస్టరీ’ బాంబు పేలింది! | Sebi, exchanges seek clarification from Tata Group on Cyrus Mistry letter | Sakshi
Sakshi News home page

‘మిస్టరీ’ బాంబు పేలింది!

Published Thu, Oct 27 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

‘మిస్టరీ’ బాంబు పేలింది!

‘మిస్టరీ’ బాంబు పేలింది!

రతన్‌టాటాపై తీవ్రంగా విరుచుకుపడుతూ సైరస్ మిస్త్రీ లేఖ
నన్ను ‘అచేతన’ చైర్మన్‌గా మార్చారు..  
నాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పవర్ సెంటర్లను ప్రోత్సహించారు..
బోర్డు సమావేశంలో నాపై వేటుకు షాక్ తిన్నా...  
కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు..
కార్పొరేట్ రంగ చరిత్రలో ఇలాంటిదెప్పుడూ జరిగి ఉండదు...  
నానోను మూసేస్తేనే టాటా మోటార్స్ బాగుపడుతుంది
ఆ 5 కంపెనీలతో రూ.1.18 లక్షల కోట్ల నష్టం  
కోరస్ స్టీల్‌తోనే 10 బిలియన్ డాలర్లను వదులుకోవాల్సి వస్తోంది
రతన్ హయాంలో విదేశీ కొనుగోళ్లతో గ్రూప్ సమస్యల్లో కూరుకుపోయిందని ఆరోపణలు...

ముంబై: టాటా గ్రూప్‌లో యాజమాన్య లుకలుకలపై ‘మిస్త్రీ’ బాంబు పేల్చారు. తనపై వేటు వెనుక ‘మిస్టరీ’ గుట్టువిప్పారు. తొలిసారి లేఖ రూపంలో మాటల యుద్ధానికి తెరతీశారు. అర్ధంతరంగా చైర్మన్ పదవి నుంచి తొలగించాక ఆయన రతన్ టాటా, టాటా సన్స్ బోర్డు సభ్యులపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. తనపై వేటు వేయడం షాక్‌కు గురిచేసిందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. టాటా సన్స్ బోర్డు సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా మంగళవారమే ఆయన లేఖను పంపారు. ‘‘గ్రూప్ నాయకత్వ బాధ్యతలు అప్పగించాక స్వేచ్ఛగా పనిచేయకుండా నా చేతులు కట్టేశారు. అచేతన చైర్మన్‌గా మార్చేశారు.

అంతేకాదు! టాటా గ్రూప్‌లో నిర్ణయాధికారాలకు సంబంధించి మార్పులు చేయడం ద్వారా రతన్ టాటా.. నాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలనూ సృష్టిం చారు’’ అని కుండబద్దలుగొట్టారు. రతన్ టాటా గతంలో కొనుగోలు చేసిన విదేశీ సంస్థలు.. ముఖ్యంగా టాటా స్టీల్ యూకే(గతంలో కోరస్) కారణంగా గ్రూప్ తీవ్ర నష్టాలను చవిచూసిందని కూడా చెప్పారు. మొత్తంమీద మిస్త్రీ ఉద్వాసనకు రతన్ టాటాతో ఆయనకున్న విభేదాలే కారణమన్నది ఆయన లేఖ ద్వారా స్పష్టమయ్యింది. అంతేకాదు.. మిస్త్రీ రతన్ టాటాపై, గ్రూప్ కార్యకలాపాలపై చేసిన ఆరోపణలు కూడా టాటా బ్రాండ్ ఇమేజ్, పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తాయనేది పరిశీలకుల అభిప్రాయం.

వేటు అన్యాయం...
‘‘దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నన్ను తొలగిస్తున్నామని చెప్పిన బోర్డు సభ్యులు... కనీసం తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. బహుశా ప్రపంచ కార్పొరేట్ రంగ చరిత్రలోనే మునుపెన్నడూ ఇలాంటిది జరిగి ఉండదని నా ఉద్దేశం. బోర్డు సమావేశంలో జరిగిన సంఘటనలతో షాక్ తిన్నా. దీన్ని మాటల్లో చెప్పలేను కూడా. చడీచప్పుడు కాకుండా నన్ను తొలగించడం అన్యాయం. ఇది చెల్లుబాటు కూడా కాదు. దీన్ని పక్కనబెడితే.. మీరు (బోర్డు డెరైక్టర్లు) అనుసరించిన విధానం అత్యంత హేయం’’ అని మిస్త్రీ లేఖలో విరుచుకుపడ్డారు.

 స్వేచ్ఛ ఇస్తామన్న హామీ గాలికి...
‘‘2012, డిసెంబర్‌లో నన్ను టాటా సన్స్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టినప్పుడు.. నాయకత్వం, నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తామని బోర్డు హామీనిచ్చింది. కానీ ఆ తర్వాత టాటాల కుటుంబ నిర్వహణలో ఉన్న ట్రస్టులు, టాటా సన్స్ బోర్డుల మధ్య నిర్ణయాధికారాలకు సంబంధించిన కంపెనీ నిబంధనలన్నింటినీ (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్) మార్చేశారు. తద్వారా గ్రూపులో ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలను సృష్టించారు. నన్ను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా అడ్డుకున్నారు. హామీలన్నింటినీ గాలికి వదిలేశారు’’ అని మిస్త్రీ ఆవేదన వ్యక్తంచేశారు.

డెరైక్టర్లు కాదు... రతన్‌కు పోస్ట్‌మన్లు!
చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినప్పటికీ తెరవెనుక నుంచి కథంతా రతన్ టాటాయే అనధికారికంగా నడిపించేవారని మిస్త్రీ పేర్కొనడం కూడా సంచలనం కలిగిస్తోంది. దేశంలో ఎంతో పేరు ప్రతిష్ఠలున్న టాటా గ్రూప్‌లో కార్పొరేట్ నైతిక నియమావళి (గ వర్నెన్స్) ఒట్టి మాటేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘టాటాల కుటుంబ అదీనంలో ఉన్న టాటా ట్రస్ట్స్ (టాటా సన్స్‌లో 66% మెజారిటీ వాటా వీటిదే) ప్రతినిధులుగా బోర్డులో ఉన్న డెరైక్టర్లను రతన్ టాటా పోస్ట్‌మన్లుగా మార్చేశారు. వాళ్లు బోర్డు సమావేశాల మధ్యలో వెళ్లిపోయి రతన్ టాటా నుంచి సూచనలను తీసుకొని మళ్లీ వచ్చేవారు’’ అని మిస్త్రీ లేఖలో పేర్కొన్నారు. దీన్నిబట్టి.. రతన్‌టాటాతో పొరపొచ్చాలే మిస్త్రీపై వేటుకు ప్రధాన కారణమన్నది వాస్తవమని వెల్లడవుతోంది.

నాయకత్వ బాధ్యతలు ఇచ్చినట్టే ఇచ్చి    నా చేతులు కట్టేశారు. నన్నొక ‘అచేతన’ చైర్మన్‌గా మార్చేశారు.

హఠాత్తుగా నన్ను తీసేస్తూ నిర్ణయం తీసుకోవడం, కనీసం వివరణ ఇచ్చుకోకుండా చేయడం... దీనిపై చిలువలుపలువలుగా ఊహాగానాలు వెల్లువెత్తేందుకు దారితీసింది. దీనివల్ల నాతోపాటు టాటా గ్రూప్ ప్రతిష్టకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది.

పనితీరు నచ్చకపోవడంవల్లే నన్ను తొలగించారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇద్దరు డెరైక్టర్లు ఇటీవలే నేను చాలా బాగా పనిచేస్తున్నానని ప్రశంసించారు కూడా.

నా హయాంలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు(టాటా స్టీల్ యూకేను విక్రయించాలన్న నిర్ణయం సహా)... గ్రూప్ పతిష్ట, పేరు ప్రఖ్యాతులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా ఆచితూచి తీసుకున్నవే.

రతన్ టాటా హయాంలో తీసుకున్న చర్యలు, విదేశీ కొనుగోళ్లు, కొన్ని ప్రాజెక్టులు టాటా గ్రూప్‌ను తీవ్రంగా దెబ్బతీశాయని మిస్త్రీ తేల్చిచెప్పారు. ఇవన్నీ గ్రూపు ఆదాయాలను హరించేయడం కాకుండా.. బ్రాండ్ ఇమేజ్‌ను కూడా దెబ్బతీశాయనేది ఆయన స్పష్టం చేశారు. రతన్‌పై మిస్త్రీ ఆరోపణల్లో ప్రధానమైనవి ఇవి...

నానో... కలల కారు కాదు, గుదిబండ!
రతన్ టాటా తన ‘మానస పుత్రిక’గా ‘కలల కారు’గా రూపొందించిన నానో కారు ప్రాజెక్టు ఎందుకూ కొరగానిదిగా మారిందని మిస్త్రీ చెప్పారు. ‘ఈ నానో ప్రాజెక్టు వల్ల గ్రూప్ భారీ మొత్తంలో పెట్టుబడులను నష్టపోయింది. అయినాసరే భావోద్వేగాల (రతన్ కలల ప్రాజెక్టు అన్న కారణంగా) కారణంతో దీన్ని మూసేయకుండా కొనసాగిస్తున్నారు. అంతేకాదు!! ఈ ప్రాజెక్టును అపేస్తే... ఒక ఎలక్ట్రిక్ కారు కంపెనీకి ‘నానో గ్లైడర్స్’ సరఫరా నిలిచిపోతుంది. ఆ కంపెనీలో (యాంపియర్ అనే స్టార్టప్)  రతన్ టాటాకు వాటా ఉంది కూడా. నానో గుదిబండగా మారినా మూసేయకపోవటానికి ఇదో కారణం’’ అని మిస్త్రీ ఆరోపించారు. రూ.లక్ష కంటే తక్కువకే నానో కారును ఇస్తామంటూ తీవ్రంగా ప్రచారం చేశారని.. అయితే, తయారీ వ్యయమే దీనికంటే అధికంగా ఉంటే ఎలా సాధ్యమని రతన్ టాటాపై చెణుకులు విసిరారు. ‘నానో వల్ల టాటా మోటార్స్ రూ.1,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. దేశీ కార్యకలాపాలకు సంబంధించి కంపెనీ టర్న్ అరౌండ్ అవ్వాలంటే నానో ప్రాజెక్టును మూసేయడమే పరిష్కారం. అయితే, భావోద్వేగాల కారణంగా ఈ కీలక నిర్ణయం తీసుకోనివ్వలేదు’’ అన్నారు.

విమానయాన రీఎంట్రీ రతన్ ఒత్తిడివల్లే...
‘‘టాటా గ్రూప్ మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడానికి కూడా ఒకరకంగా రతన్ టాటా ఒత్తిడే కారణం. ఎయిర్ ఏషియా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్ల (జేవీ) ఏర్పాటుకు బలవంతంగా నాతో ఒప్పించారు. ముందుగా అనుకున్నదానికంటే అధికంగా ఈ జేవీల్లో పెట్టుబడులు పెట్టేలా చేశారు. దీనిపై నాకు నిర్ణయాధికారం లేకుండా చేశారు’’ అని మిస్త్రీ పేర్కొన్నారు. అంతేకాదు.. టాటా గ్రూప్‌తో సంబంధం లేని సంస్థల ప్రమేయంతో సింగపూర్, భారత్‌లలో దాదాపు రూ.22 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తాజాగా ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. తద్వారా గ్రూపు కార్యకలాపాలకు సంబంధించి నైతికతపై కూడా ప్రశ్నలు తలెత్తేలా చేశారు.

ఐదు కంపెనీలతో రూ.1.18 లక్షల కోట్ల నష్టం...
రతన్ టాటా హయాం నుంచి తనకు వారసత్వంగా గుదిబండల్లాంటి కొన్ని వ్యాపారాలను అప్పగించారన్నారని మిస్త్రీ పేర్కొన్నారు. ‘‘ప్రధానంగా ఐదు నష్టజాతక వ్యాపారాల వల్ల సుమారు రూ.1.18 లక్షల కోట్లను కంపెనీ నష్టపోవాల్సిన (రైట్ డౌన్ చేసుకోవాల్సి రావడం) పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గ్రూప్ నెట్‌వర్త్ రూ.1.74 లక్షల కోట్లుగా ఉంది. ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల కార్యకలాపాలు, టాటా స్టీల్ యూరోపియన్ కార్యకలాపాలు, టాటా పవర్‌కు చెందినకొన్ని విద్యుత్ యూనిట్లు, టెలికం వెంచర్ (టాటా డొకోమో) ఇందులో ఉన్నాయి. వీటికి మోయలేనంత రుణభారం కూడా ఉంది’’ అని పేర్కొన్నారు.

టాటా స్టీల్‌తో 10 బిలియన్ డాలర్లు హుష్!
రతన్ టాటా హయాంలో జరిపిన విదేశీ కొనుగోళ్లు కూడా గ్రూప్‌పై నష్టాల భారాన్ని మోపిందని మిస్త్రీ ఆరోపించారు. ఒక్క జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్), టెట్లే టీ కంపెనీలు మినహా మిగిలిన కంపెనీల కారణంగా గ్రూప్ అప్పుల భారం తారస్థాయికి చేరిందన్నారు. ఈ సమస్యాత్మక కంపెనీలన్నిటినీ వారసత్వంగా తనకు రతన్ టాటా అప్పగించారని కూడా పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా టాటా స్టీల్ యూరోపియన్ స్టీల్ వ్యాపారం (రతన్ టాటా కోరస్‌ను కొనుగోలు చేయడం ద్వారా వచ్చింది) వల్ల 10 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.67 వేల కోట్లు) పైగా విలువైన పెట్టుబడులను నష్టపోవాల్సి వస్తోంది.

ఇండియన్ హోటల్స్‌కు (ఐహెచ్‌సీఎల్) చెందిన అనేక విదేశీ ఆస్తులతో పాటు ఓరియంట్ హోటల్స్‌లో వాటాలను కూడా తీవ్రమైన నష్టాలకు విక్రయించాల్సి వచ్చింది. గత హయాంలో ఐహెచ్‌సీఎల్ జరిపిన విదేశీ కొనుగోళ్ల వల్ల గడిచిన మూడేళ్లలో కంపెనీ మొత్తం నెట్‌వర్త్‌తో సమానమైన మొత్తాన్ని రైట్‌డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు డివిడెండ్లు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క, టాటా కెమికల్స్‌కు చెందిన యూకే, కెన్యా కార్యకలాపాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. వీటికి సంబంధించి వదిలించుకోవటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇన్‌ఫ్రా రంగానికి టాటా క్యాపిటల్ ఇచ్చిన భారీ రుణాలన్నీ మొండిబకాయిలుగా మారాయి. వీటిని రాబట్టుకోవడం సవాలుతో కూడిన పని’’ అని పేర్కొన్నారు.

తీవ్ర సమస్యల్లో టెలికం వ్యాపారం...
‘‘టాటా గ్రూప్ టెలికంలో ముందునుంచీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. నా హయాంలోకి వచ్చేటప్పటికి  చక్కదిద్దలేని స్థాయికి చేరింది. ఒకవేళ దీన్నుంచి వైదొలగితే (మూసేయడం లేదా అయినకాడికి అమ్మేయడం) 4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. టాటా డొకోమో జాయింట్ వెంచర్ సంస్థ నుంచి బయటికెళ్లిపోయిన జపాన్ కంపెనీ డొకోమోకు చెల్లించాల్సిన బిలియన్ డాలర్లకుపైగా మొత్తానికిది అదనం. ఇన్ని సమస్యలున్నప్పటికీ.. టాటా డొకోమో స్థూల లాభాలు గత మూడేళ్లలో రూ.400 కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు పెరిగాయి.’’

టాటా పవర్‌కు ‘ముంద్రా’ షాక్...
ఇండోనేసియా బొగ్గు తక్కువ ధరకు వస్తుందన్న అంచనాలతో ముంద్రా విద్యుత్ ప్రాజెక్టుకు టాటా పవర్ అధిక మొత్తానికి బిడ్డింగ్ వేయడంతో చేతులు కాలాయని మిస్త్రీ చెప్పారు. ప్రాజెక్టు వచ్చాక నిబంధనలు మారిపోవడంతో 2013-14లో రూ.1,500 కోట్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ముంద్రాలో రూ.18,000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని, భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని మిస్త్రీ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement