
విదేశీ ఇన్వెస్టర్లకు రెడ్‌కార్పెట్!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడంపై సెబీ దృష్టిసారించింది. ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లో కొన్ని విభాగాలకు చెందిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)కు నేరుగా ట్రేడింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ముందుగా డెట్ మార్కెట్లో(బాండ్స్) ఇందుకు అనుమతించి... క్రమంగా ఈక్విటీ మార్కెట్లకూ వర్తింపజేయనున్నట్లు సెబీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నేడు(శుక్రవారం) జరగనున్న బోర్డు సమావేశంలో సెబీ చర్చించనున్నట్లు సమాచారం.
ఎఫ్‌పీఐలకు ఈ అనుమతులపై సెబీ ముందుగా చర్చాపత్రాన్ని విడుదల చేయనుందని.. వివిధ పక్షాల నుంచి అభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో దేశీ స్టాక్ బ్రోకర్ల ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు.కాగా, కేటగిరీ-1, 2 ఎఫ్‌పీఐలకు సెబీ ఈ ప్రత్యక్ష ట్రేడింగ్ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో సావరీన్ వెల్త్ ఫండ్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక కేటగిరీ-2లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులకు చోటుంది. అయితే, హెడ్జ్ ఫండ్స్, వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు ఇతర హై-రిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు ఈ సదుపాయం లేనట్టే.
ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ నిధులను మరింత వెల్లువెత్తేలా చేయడమే సెబీ తాజా ప్రతిపాదనల ఉద్దేశం. అయితే, ఇది దేశీ బ్రోకరేజి సంస్థల మనుగడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెబీవద్ద రిజిస్టర్ అయిన ఎఫ్‌పీఐలు ఇప్పటివరకూ దేశీ మార్కెట్లో రూ.11.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో రూ.8.45 లక్షల కోట్లు ఈక్విటీ(స్టాక్స్)ల్లో, రూ.3.06 లక్షల కోట్లు బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు.
చర్చించనున్న ఇతర ప్రతిపాదనలు...
* కంపెనీలు నాన్-ప్రమోటర్ల(ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్)కు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు మైనారిటీ ఇన్వెస్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
* రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు(రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు(ఇన్‌విట్స్)లో పెట్టుబడులకు మరింత సరళతరమైన నిబంధనలు. ఇప్పటికే దీనిపై సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతోంది. 2014లో వీటిని సెబీ నోటిఫై చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రస్ట్‌ల ఏర్పాటు, వీటిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి దారులుతెరిచింది.
* స్టార్టప్‌ల లిస్టింగ్ నిబంధనల సరళతరం. 2015 ఆగస్టులో సెబీ దీన్ని అమల్లోకి తీసుకురాగా, ఇప్పటివరకూ ఒక్క స్టార్టప్ కూడా లిస్ట్ కాలేదు.