జాతకం చెప్పాడు జైల్లో పడ్డాడు
విజితముని రహానా డిసిల్వా! శ్రీలంక క్రికెటర్ కాదు. శ్రీలంక ఆస్థాన జ్యోతిష్కుడూ కాదు. శ్రీలంక నేవీలో ఓ మాజీ నావికుడు. ప్రస్తుతం బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఏం తప్పు చేసి జైలుకు వెళ్లాడు? ఏం చెప్పి బెయిలుతో బైటికొచ్చాడు! ఏం లేదు. రిటైర్డ్ అయ్యాక విజితముని జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్ల చెయ్యి చూసి చెప్పినంత కాలం ఆయనకు ఏమీ కాలేదు. నువ్వు చెప్పింది జరిగిందని వచ్చి చెప్పినవాళ్లు లేరు.
నువ్వు చెప్పింది జరగలేదేంటని వచ్చి అడిగినవాళ్లూ లేరు. అక్కడితో ఊరుకోవలసింది. కానీ ఈయన ఏం చేశాడంటే జనవరి 26న శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన చనిపోబోతున్నాడని గత ఆర్నెల్లుగా టముకు వేస్తున్నాడు. జనవరి 26 రానూ వచ్చింది, పోనూ పోయింది. సిరిసేన మాత్రం పైకి పోలేదు. పోలీసులొచ్చి విజితమునిని పట్టుకెళ్లారు. ఇంకెప్పుడూ జాతకాలు చెప్పనని హామీ ఇచ్చి, మాట తప్పితే 20 లక్షల రూపాయలు కడతానని బాండు రాసిచ్చి మరీ బయటపడ్డాడు!