Sirisena
-
ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు
కొలంబో: ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని, దానిని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భారత్, శ్రీలంక అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్‌లో ఈస్టర్ పర్వదినాన జరిగిన బాంబు దాడుల విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న శ్రీలంకకు సంఘీభావం తెలిపేందుకు భారత ప్రధాని మోదీ ఆదివారం కొలంబో చేరుకున్నారు. మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన మోదీకి అధ్యక్షుడు సిరిసేన ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈస్టర్ ఉగ్రదాడుల అనంతరం శ్రీలంకకు వెళ్లిన మొదటి నేత భారత ప్రధాని కావడం గమనార్హం. ‘అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను పది రోజుల్లో రెండోసారి కలుసుకున్నాను. ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భావించాం. శ్రీలంక భద్రత, ఉజ్వల భవిష్యత్తులో భాగస్వామి అయ్యేందుకు భారత్ కట్టుబడి ఉంది’అని సిరిసేనతో భేటీ అనంతరం మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన సిరిసేన.. ఆయనకు ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం ప్రతిని బహూకరించారు. అనురాధపురలో ఉన్న ధ్యానబుద్ధుని భారీ శిల్పం 4 నుంచి 7వ శతాబ్దాల మధ్య ఏర్పాటైందని ప్రధాని కార్యాలయం వివరించింది. ఈ విగ్రహ నమూనాను తెల్లటేకుతో రూపొందించేందుకు నిపుణులకు రెండేళ్లు పట్టిందని తెలిపింది. ఉగ్రదాడి మృతులకు నివాళి ప్రధాని మోదీ కొలంబో ఎయిర్‌పోర్టు నుంచి అధ్యక్షుని కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఉన్న సెయింట్ ఆంథోనీ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా బాంబుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ‘పిరికిపందల ఉగ్ర చర్య శ్రీలంక స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. శ్రీలంక ప్రజలకు భారత్ తోడుగా ఉంటుంది’అని మోదీ అన్నారు. ఈస్టర్ పండగ రోజు ఉగ్రదాడులకు గురైన చర్చిల్లో ఇది ఒకటి. ఏప్రిల్‌లో తౌహీద్ జమాత్ అనే ఉగ్ర సంస్థ జరిపిన దాడుల్లో వందలాది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మోదీకి అమూల్య కానుక ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్ష నివాసం వద్ద ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని మోదీకి స్వయంగా గొడుగుపట్టారు. అధ్యక్ష భవనం ప్రాంగణంలో మోదీ అశోక మొక్కను నాటారు. అనంతరం ప్రధాని రణిల్ విక్రమసింఘేతో సమావేశమ య్యారు. ప్రతిపక్ష నేత మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, తమిళ పార్టీల కూటమి నేత ఆర్.సంపతన్‌తోనూ సమావేశమయ్యారు. శ్రీలంకలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడిన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు పయన మయ్యారు. ప్రధాని మోదీ 2015, 2017 సంవత్సరాల్లో కూడా శ్రీలంకలో పర్యటించారు. గత నెలలో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన హాజరయ్యారు. -
శ్రీలంక పేలుళ్లు : ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు
కొలంబో : వరుస పేలుళ్లతో 300 మందికి పైగా మరణించడం, వందలాది మంది గాయపడటంతో నిలువెల్లా వణికిన శ్రీలంక ఉగ్ర ఘటన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు చేపడుతోంది. విదేశీ నిఘా వర్గాల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ చీఫ్, రక్షణ కార్యదర్శులను రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తేల్చిచెప్పారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారాన్ని భద్రతాధికారులు తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతాయనే సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదని శ్రీలంక పార్లమెంట్లో సీనియర్ నేత లక్ష్మణ్ కిరిల్లా తెలిపారు. చర్చిలు, హోటళ్లు, రాజకీయ నేతల లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని ఏప్రిల్ 4న భారత నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, ఏప్రిల్ 7న అధ్యక్షుడు సిరిసేన అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై భద్రతాధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నుంచి దాడులపై సమాచారం ఉన్నప్పటికీ సరైన చర్యలు చేపట్టడంలో టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. -
నేడు శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా!
కొలంబో: శ్రీలంకలో రెండు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని పదవికి మహింద రాజపక్స నేడు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ప్రధాని రాజపక్స, ఆయన మంత్రివర్గం తమ అధికారాలను నిర్వర్తించకుండా కోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ శుక్రవారం మరో కీలక తీర్పు వెలువరించింది. ‘దేశంలో రాజకీయ అస్థిరత తొలగిపోయేందుకు వీలుగా రాజపక్స తన పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ), శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లు మరికొన్ని పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ రాజ పక్స కుమారుడు నమల్ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజపక్స తప్పుకుంటే తమ నేతను తిరిగి ప్రధానిగా చేయడం మినహా అధ్యక్షుడు సిరిసేనకు మరో మార్గంలేదని విక్రమసింఘే మద్దతుదారులు అంటున్నారు. అయితే, విక్రమసింఘేతో విభేదాలున్నందున ఆయన్ను తిరిగి ప్రధానిగా నియమించేది లేదని సిరిసేన స్పష్టం చేస్తున్నారు. -
అధ్యక్షుని చర్య రాజ్యాంగ విరుద్ధం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం నాలుగున్నరేళ్లయినా పూర్తి చేయకుండా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయజాలడని పేర్కొంది. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేను అక్టోబర్ 26వ తేదీన తొలగించిన అధ్యక్షుడు , ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను నియమించారు. దీంతోపాటు 20 నెలల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేసి, జనవరిలో ఎన్నికలు జరిపేందుకు అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. అధ్యక్షుడి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం అధ్యక్షుడు జారీ చేసిన తక్షణ ఎన్నికల ఉత్తర్వులను నిలిపివేస్తూ నవంబర్ 13వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పటి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏడుకు పెంచింది. గురువారం తీర్పు సందర్భంగా అధికారులు సుప్రీంకోర్టు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. -
జాతకం చెప్పాడు జైల్లో పడ్డాడు
విజితముని రహానా డిసిల్వా! శ్రీలంక క్రికెటర్ కాదు. శ్రీలంక ఆస్థాన జ్యోతిష్కుడూ కాదు. శ్రీలంక నేవీలో ఓ మాజీ నావికుడు. ప్రస్తుతం బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఏం తప్పు చేసి జైలుకు వెళ్లాడు? ఏం చెప్పి బెయిలుతో బైటికొచ్చాడు! ఏం లేదు. రిటైర్డ్ అయ్యాక విజితముని జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్ల చెయ్యి చూసి చెప్పినంత కాలం ఆయనకు ఏమీ కాలేదు. నువ్వు చెప్పింది జరిగిందని వచ్చి చెప్పినవాళ్లు లేరు. నువ్వు చెప్పింది జరగలేదేంటని వచ్చి అడిగినవాళ్లూ లేరు. అక్కడితో ఊరుకోవలసింది. కానీ ఈయన ఏం చేశాడంటే జనవరి 26న శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన చనిపోబోతున్నాడని గత ఆర్నెల్లుగా టముకు వేస్తున్నాడు. జనవరి 26 రానూ వచ్చింది, పోనూ పోయింది. సిరిసేన మాత్రం పైకి పోలేదు. పోలీసులొచ్చి విజితమునిని పట్టుకెళ్లారు. ఇంకెప్పుడూ జాతకాలు చెప్పనని హామీ ఇచ్చి, మాట తప్పితే 20 లక్షల రూపాయలు కడతానని బాండు రాసిచ్చి మరీ బయటపడ్డాడు!