కొలంబో : వరుస పేలుళ్లతో 300 మందికి పైగా మరణించడం, వందలాది మంది గాయపడటంతో నిలువెల్లా వణికిన శ్రీలంక ఉగ్ర ఘటన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు చేపడుతోంది. విదేశీ నిఘా వర్గాల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ చీఫ్, రక్షణ కార్యదర్శులను రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తేల్చిచెప్పారు.
ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారాన్ని భద్రతాధికారులు తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతాయనే సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదని శ్రీలంక పార్లమెంట్‌లో సీనియర్ నేత లక్ష్మణ్ కిరిల్లా తెలిపారు.
చర్చిలు, హోటళ్లు, రాజకీయ నేతల లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని ఏప్రిల్ 4న భారత నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, ఏప్రిల్ 7న అధ్యక్షుడు సిరిసేన అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై భద్రతాధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నుంచి దాడులపై సమాచారం ఉన్నప్పటికీ సరైన చర్యలు చేపట్టడంలో టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment