ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు | PM Modi meets Sri Lankan President Sirisena | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు

Published Mon, Jun 10 2019 5:04 AM | Last Updated on Mon, Jun 10 2019 7:54 AM

PM Modi meets Sri Lankan President Sirisena - Sakshi

కొలంబో: ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని, దానిని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భారత్, శ్రీలంక అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్‌లో ఈస్టర్‌ పర్వదినాన జరిగిన బాంబు దాడుల విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న శ్రీలంకకు సంఘీభావం తెలిపేందుకు భారత ప్రధాని మోదీ ఆదివారం కొలంబో చేరుకున్నారు. మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన మోదీకి అధ్యక్షుడు సిరిసేన ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈస్టర్‌ ఉగ్రదాడుల అనంతరం శ్రీలంకకు వెళ్లిన మొదటి నేత భారత ప్రధాని కావడం గమనార్హం. ‘అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను పది రోజుల్లో రెండోసారి కలుసుకున్నాను.

ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భావించాం. శ్రీలంక భద్రత, ఉజ్వల భవిష్యత్తులో భాగస్వామి అయ్యేందుకు భారత్‌ కట్టుబడి ఉంది’అని సిరిసేనతో భేటీ అనంతరం మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన సిరిసేన.. ఆయనకు ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం ప్రతిని బహూకరించారు. అనురాధపురలో ఉన్న ధ్యానబుద్ధుని భారీ శిల్పం 4 నుంచి 7వ శతాబ్దాల మధ్య ఏర్పాటైందని ప్రధాని కార్యాలయం వివరించింది. ఈ విగ్రహ నమూనాను తెల్లటేకుతో రూపొందించేందుకు  నిపుణులకు రెండేళ్లు పట్టిందని తెలిపింది.

ఉగ్రదాడి మృతులకు నివాళి
ప్రధాని మోదీ కొలంబో ఎయిర్‌పోర్టు నుంచి అధ్యక్షుని కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఉన్న సెయింట్‌ ఆంథోనీ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా బాంబుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ‘పిరికిపందల ఉగ్ర చర్య శ్రీలంక స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. శ్రీలంక ప్రజలకు భారత్‌ తోడుగా ఉంటుంది’అని మోదీ అన్నారు. ఈస్టర్‌ పండగ రోజు ఉగ్రదాడులకు గురైన చర్చిల్లో ఇది ఒకటి. ఏప్రిల్‌లో తౌహీద్‌ జమాత్‌ అనే ఉగ్ర సంస్థ జరిపిన దాడుల్లో వందలాది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మోదీకి అమూల్య కానుక
ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్ష నివాసం వద్ద ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని మోదీకి స్వయంగా గొడుగుపట్టారు. అధ్యక్ష భవనం ప్రాంగణంలో మోదీ అశోక మొక్కను నాటారు. అనంతరం ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతో సమావేశమ య్యారు.  ప్రతిపక్ష నేత మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, తమిళ పార్టీల కూటమి నేత ఆర్‌.సంపతన్‌తోనూ సమావేశమయ్యారు. శ్రీలంకలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడిన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు పయన మయ్యారు. ప్రధాని మోదీ 2015, 2017 సంవత్సరాల్లో కూడా శ్రీలంకలో పర్యటించారు. గత నెలలో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement