114 పాయింట్ల నష్టంతో 28,221కు సెన్సెక్స్
25 పాయింట్ల నష్టంతో 8,744 వద్ద ముగింపు
యూరోప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీని ఉపసంహరించనున్నదన్న వార్తలకు లాభాల స్వీకరణ జతకావడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 28,221 పాయింట్ల వద్ద,ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 8,744 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, ఐటీ, టెక్నాలజీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,800 పాయింట్లు దాటినా.. అమ్మకాల ఒత్తిడితో నిలదొక్కుకోలేకపోయింది.
ఆరంభంలో లాభాలు..: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అంచనాలతో ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్‌కు లాభాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది చివరినాటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయని ఊహాగానాలు, బ్రెగ్జిట్ ప్రభావం తీవ్రం కానున్నదనే అంచనాలు, ఆగస్టులో 54.7గా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 52కు తగ్గడం ... ప్రతికూల ప్రభావం చూపాయి.
ప్యాకేజీని ఈసీబీ ఉపసంహరించే అవకాశాలున్నాయన్న ఊహాగానంతో అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరిగాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. దీంతో యూరోప్ మార్కెట్లు నష్టాల పాలుకాగా, దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు.
లాభాల్లో లోహ, టైర్ల షేర్లు
చౌక ఎగుమతుల నుంచి దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి 66 ఉక్కు ఉత్పత్తులపై కనీస దిగుమతి ధరను మరో రెండు నెలల పాటు ప్రభుత్వం పొడిగించడంతో ఉక్కు కంపెనీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1% వరకూ పెరిగాయి. సహజ రబ్బరు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో టైర్ల కంపెనీల షేర్లు పెరిగాయి. ఎంఆర్‌ఎఫ్, సియట్, గుడ్ ఇయర్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్లు 1-8% రేంజ్‌లో పెరిగాయి.
మూడు రోజుల లాభాలకు బ్రేక్
Published Thu, Oct 6 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement