మూడు రోజుల వరుస లాభాల తరువాత గురువారం స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించి 27,941 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 25 పాయింట్ల నష్టంతో 8,358 వద్ద నిలిచింది. ముందురోజు సెన్సెక్స్ 28,126 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారని విశ్లేషకులు తెలిపారు. అయితే పారిశ్రామికోత్పత్తి మూడు నెలల గరిష్టానికి చేరడం, రిటైల్ ద్రవ్యోల్బణం 5.5%కు దిగడం వంటి సానుకూల అంశాల కారణంగా తొలుత సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 28,099 వద్ద గరిష్టానికి చేరింది.
ఎక్సైజ్ సుంకం పెంపు ఎఫెక్ట్
బీఎస్‌ఈలో ప్రధానంగా ఆయిల్, రియల్టీ రంగాలు 1.5% చొప్పున నీరసించాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను పెంచడంతో చమురు ఉత్పత్తి, మార్కెటింగ్ కంపెనీల షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయ్. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కెయిర్న్, ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ 6-2% మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ షేర్లు యూనిటెక్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, మహీంద్రా లైఫ్, అనంత్‌రాజ్ 5.5-2% మధ్య తిరోగమించాయి.
ఇక యూపీ ప్రభుత్వం చెరకు మద్దతు ధరను పెంచకపోవడంతో చక్కెర షేర్లు అప్పర్ గేంజెస్, బలరామ్‌పూర్, బజాజ్ హిందుస్తాన్, ఓధ్, ధంపూర్ షుగర్ 12-4% మధ్య దూసుకెళ్లాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, టాటా పవర్, యాక్సిస్ 2.5-1.5% మధ్య నష్టపోగా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ 1% చొప్పున లాభపడ్డాయి.
ఆయిల్ షేర్లు డీలా
Published Fri, Nov 14 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement