మార్కెట్లు అక్కడక్కడే...
ఆసియా మార్కెట్ల నష్టాల ప్రభావంతో దేశీ స్టాక్ సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. చివరికి సోమవారం ముగింపును పోలి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 26,315-26,482 పాయింట్ల మధ్య ఒడిదుడుకులకు లోనైంది.
చివరికి 6 పాయింట్ల స్వల్ప లాభంతో 26,443 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్ట ముగింపుకాగా, నిఫ్టీ మాత్రం ఒక పాయింట్ తగ్గి 7,905 వద్ద నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలలో ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అక్రమమంటూ సుప్రీం కోర్టు పేర్కొనడం, గురువారం ముగియనున్న ఆగస్ట్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారంటూ నిపుణులు పేర్కొన్నారు.
హెల్త్‌కేర్ ఓకే, పవర్ డీలా
బీఎస్‌ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్ ఇండెక్స్ 1%పైగా లాభపడగా, పవర్ అదే స్థాయిలో డీలాపడింది. సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా 3.6-1.4% మధ్య పుంజుకోగా, టాటా పవర్, ఓఎన్‌జీసీ 2.5% చొప్పున నష్టపోయాయి.