సెన్సెక్స్‌కు 148 పాయింట్లు లాభం
- 27,958 పాయింట్ల వద్ద ముగింపు
- 38 పాయింట్ల లాభంతో 8,459కు నిఫ్టీ
ఎస్‌బీఐ, కొన్ని ఇతర కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. గురువారం అమెరికా మార్కెట్లు, ఈ జోరుతో శుక్రవారం ఆసియా మార్కెట్లు పెరగడం కూడా కలసి వచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 28 వేల పాయింట్లను దాటింది. మొత్తం మీద సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 27,958 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,459 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, రిఫైనరీ, టెక్నాలజీ షేర్లు కళకళలాడాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.
పూర్తిగా టెక్నికల్స్: విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో సెంటిమెంట్ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే ఈ పెరుగుదల పూర్తిగా టెక్నికల్స్ మీద ఆధారపడి ఉందని, ఆర్థిక వృద్ధి, కంపెనీల ఆర్థిక ఫలితాల వంటి ఫండమెంటల్స్ విషయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. బ్లూచిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు భారీగా జరిగాయని వెరాసిటి బ్రోకింగ్ హెడ్ (రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు.