రికార్డుల బాటలోనే...
యూఎస్ ఆర్థిక గణాంకాలు, యూఎస్ సహాయక ప్యాకేజీ వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పుంజుకున్నాయి. వెరసి వరుసగా మూడో రోజూ రికార్డుల బాటలోనే సాగాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు లాభపడి 26,560 వద్ద నిలవగా, 31 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 7,936 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్ట స్థాయి ముగింపులుకాగా, సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు లాభపడటం విశేషం! కాగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,599ను తాకగా, నిఫ్టీ 7,947కు చేరింది. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ మరోసారి సహాయక ప్యాకేజీలకు సై అనడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకుల అంచనా.
డిఫెన్స్ షేర్ల జోరు: ర క్షణ రంగ పరికరాల షేర్లకు భారీ డిమాండ్ కనిపించింది. రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడం ఇందుకు దోహదపడింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 20% జంప్‌చేయగా, ఆస్ట్రా మైక్రోవేవ్ 8%, బీఈఎంఎల్ 5% చొప్పున పుంజుకున్నాయి. మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ వార్తలతో యూకో బ్యాంక్ 8% పతనం అయ్యింది.