300 పాయింట్లు పతనం
మార్కెట్ అప్‌డేట్
* 27,209కు దిగిన సెన్సెక్స్
* అమెరికా వడ్డీ పెంపు భయాలు
* లాభాల స్వీకరణ ఎఫెక్ట్ కూడా
* ఎన్‌ఎస్‌ఈ టర్నోవర్ రికార్డు
అంచనాలకంటే ముందుగానే అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చునన్న ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను మరోసారి పడగొట్టాయి. క్యూ3లో యూఎస్ జీడీపీ 5% పుంజుకోవడం దీనికి కారణం కాగా, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు రోజు కావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడం కూడా జతకలిసింది. వెరసి సెన్సెక్స్ 298 పాయింట్లు పతనమైంది. వారం రోజుల కనిష్టమైన 27,209 వద్ద ముగిసింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 93 పాయింట్లు జారి 8,200 కీలక స్థాయి దిగువకు చేరింది. 8,174 వద్ద నిలిచింది.
పీఎస్‌యూలు డీలా
సెన్సెక్స్ దిగ్గజాలలో పీఎస్‌యూలు భెల్, ఎన్‌టీపీసీ, గెయిల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా 3-2% మధ్య నీరసించా యి. ఈ బాటలో ఇతర బ్లూచిప్స్ హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, డాక్టర్ రెడ్డీస్ 2-1% మధ్య క్షీణించాయి. డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల ము గింపు నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ డెరివేటివ్స్‌లో రికార్డు టర్నోవర్ జరిగింది. ఇండెక్స్ ఆప్షన్స్‌లో నమోదైన రూ. 4,53,562 కోట్లతో కలిపి ఎఫ్‌అండ్‌వోలో మొత్తం రూ. 5,66,898 కోట్లు జరిగింది. ఇక నగదు విభాగంలోనూ రూ. 22,159 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా, అల్ట్రాటెక్‌కు 2 సిమెంట్ ప్లాంట్లను విక్రయించనున్న జేపీ అసోసియేట్స్ షేరు 9% జంప్‌చేసింది. మెడికల్ పరికరాల రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయడంతో ఆప్టో సర్క్యూట్స్ 16% దూసుకెళ్లింది.
నేడు మార్కెట్లకు సెలవు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు.