బంగారం వెలవెల.. షేర్లు మిలమిల
న్యూఢిల్లీ: షేర్ల మెరుపుల ముందు పసిడి వెలవెలపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 22.76 శాతం పెరగ్గా బంగారం ధరలు 5 శాతం క్షీణించాయి. వెండి రేటు నామమాత్రంగా 2.38 శాతం పెరిగింది. ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగవ్వడం, విదేశీ నిధులు పుష్కలంగా వస్తుండడంతో దేశీయ ఈక్విటీలకు ఇది శుభ సంవత్సరమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
షేర్లు, బంగారం ధరలు సాధారణంగా భిన్నమార్గాల్లో పయనిస్తుంటాయి. అంటే, షేర్ల రేట్లు ఎగువముఖంలో ఉంటే పసిడి ధరలు దిగువముఖంలో ఉంటాయి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించడానికి ప్రజలు బంగారాన్ని ఆశ్రయిస్తుంటారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నపుడు పుత్తడిలో పెట్టుబడులు భద్రమని భావిస్తుంటారు. ధరల పెరుగుదల పరంగా దశాబ్దానికిపైగా షేర్లపై పైచేయి సాధించిన బంగారం వరుసగా రెండో ఏడాది వెనుకంజ వేసింది. గత డిసెంబరు 31న 10 గ్రాముల బంగారం ధర రూ.29,800, కిలో వెండి రేటు రూ.43,755గా ఉన్నాయి.
సోమవారం ముగింపు ధరలు చూస్తే బంగారం రూ.28,370, వెండి రూ.44,800గా ఉన్నాయి. డిసెంబరు 31వ తేదీన 21,170.68 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ సోమవారం 25,991.23 పాయింట్ల వద్ద క్లోజైంది. ఈ నెల 25న 26,300 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి సెన్సెక్స్ చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా 2,550 కోట్ల డాలర్లను (రూ.1.53 లక్షల కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేశారు. సెన్సెక్స్ గతేడాది ఇన్వెస్టర్లకు 9 శాతం ఆదాయాన్నివ్వగా బంగారం ధరలు 3 శాతం, వెండి రేటు ఏకంగా 24 శాతం పడిపోయాయి.