మార్కెట్ల పతనంపై ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్ల పతనంపై కలవరపడుతున్న ఇన్వెస్టర్లకు భరోసా కల్పిం చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత మార్కెట్లపై అంతర్జాతీయ ప్రతికూలాంశాల ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. లాభదాయకతను దెబ్బతీస్తూ గుదిబండలా మారిన మొండిబకాయిల సమస్యలను పరిష్కరించుకోవడానికి బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితుల్లోనూ అధిక వృద్ధిని సాధించేందుకు తగు విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జైట్లీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తిన ప్రభావం భారత్ సహా ఇతర దేశాలపైనా పడిందని చెప్పారు.