ఆ 400 షేర్లతో జాగ్రత్త!
* లిక్విడిటీ లేని స్టాక్స్‌పై ఇన్వెస్టర్లకు స్టాక్ ఎక్స్చేంజీల సూచన
* జాబితాలో జెనిత్ కంప్యూటర్స్, ఖేతాన్ ఇండియా తదితర స్టాక్స్
ముంబై: ట్రేడింగ్ పరిమాణం అంతగా ఉండని 400 స్టాక్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ సూచించాయి. ఇందులో బిల్‌పవర్, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్, ఖైతాన్ (ఇండియా), జెనిత్ కంప్యూటర్స్ మొదలైనవి ఉన్నాయి. సెబీ ఆదేశాల మేరకు బీఎస్‌ఈ 363 సంస్థలు, ఎన్‌ఎస్‌ఈ 33 సంస్థల షేర్లతో కూడిన లిస్టును తయారు చేశాయి.
ఈ జాబితాను తమ తమ బ్రోకింగ్ సభ్యులకు కూడా సర్క్యులర్‌లు పంపాయి. పరిమితమైన ట్రేడింగ్ ఉండటం వల్ల అంత సులువుగా అమ్మడం వీలు కాని షేర్లను ‘ఇల్లిక్విడ్’ షేర్లుగా వ్యవహరిస్తారు. మిగతా వాటితో పోలిస్తే వీటిని కొనేవారు చాలా తక్కువగా ఉండటం వల్ల విక్రయించాలనుకునే వారికి రిస్కులు అధికంగా ఉంటాయి. సెబీ ఆదేశాల మేరకు త్రైమాసికాల వారీగా స్టాక్ ఎక్స్చేంజీలు ఇలాంటి లిస్టెడ్ సంస్థల షేర్లతో జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది.