మెటల్ షేర్ల మెరుపులు
హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు
⇒ 50 పాయింట్లు క్షీణించి 27,440కు సెన్సెక్స్
⇒ 7 పాయింట్ల నష్టంతో 8,325కు నిఫ్టీ
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో లోహ షేర్లు మెరుపులు మెరిపించినప్పటికీ, స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 27.440 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 8,325 పాయింట్ల వద్ద ముగిశాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా తదితర షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓఎన్‌జీసీ, టీసీఎస్, వేదాంత, హిందూస్తాన్ యూనిలివర్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా మోటార్స్ లాభపడడంతో సెన్సెక్స్‌కు భారీ నష్టాలు తప్పాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రే డవటం కూడా ప్రభావం చూపింది. లోహ, ఇంధన షేర్లు సెన్సెక్స్‌కు తోడ్పాటునందించాయి. సెన్సెక్స్ 27,604-27,338 పాయింట్ల గరిష్ట, కనిస్ట స్థాయిల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 150 పాయింట్లకు పైగా నష్టపోయింది.
చైనా నుంచి డిమాండ్ బాగా ఉండటంతో లోహ షేర్లు మెరుపులు మెరిపించాయి. బీఎస్‌ఈ అన్ని రంగాల సూచీల్లో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. ఉక్కు రంగం రిటర్న్ ఆన్ ఈక్విటీ రెండేళ్లలో రెట్టింపై 14 శాతానికి చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వెల్లడించడంతో లోహ షేర్లు వెలిగిపోయాయి. ఇనుప ఖనిజంపై ఎగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 10 శాతానికి ప్రభుత్వం తగ్గించడం కూడా ప్రభావం చూపింది.
ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల విలువ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 19.32 లక్షల కోట్లకు ఎగిసింది. ఇది ఆరేళ్ల గరిష్టం. నరేంద్ర మోది సారథ్యంలోని ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఆశావహ భావం ఇందుకు కారణం. కన్సల్టెన్సీ సంస్థ ప్రైమ్ డేటాబేస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎఫ్‌ఐఐల హోల్డింగ్స్ విలువ రూ. 18.3 లక్షల కోట్లుగా ఉండగా, 2015 మార్చి త్రైమాసికానికి రూ. 19.32 లక్షల కోట్లకు పెరిగింది.
గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ విలువ రూ. 12.34 లక్షల కోట్లు. అయితే, శాతాల వారీగా చూస్తే ఆయా కంపెనీల్లో ఎఫ్‌ఐఐల వాటా క్రితం మూణ్నెల్లతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 6.54 శాతం నుంచి 6.44 శాతానికి తగ్గింది. నివేదిక ప్రకారం ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల్లో 465 ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా బ్యాంకుల్లో రూ. 3.44 లక్షల కోట్లు, ఆ తర్వాత ఐటీ కంపెనీల్లో రూ. 2.77 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. కంపెనీలపరంగా హెచ్‌డీఎఫ్‌సీలో అత్యధికంగా 79.65 శాతం మేర ఎఫ్‌ఐఐ హోల్డింగ్స్ ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,474 కంపెనీల్లో 1,448 సంస్థలు మార్చి త్రైమాసికంలో దాఖలు చేసిన షేర్‌హోల్డింగ్ గణాంకాల ఆధారంగా ప్రైమ్ డేటాబేస్ ఈ నివేదికను రూపొందించింది.