ముంబై: అంతర్జాతీయంగా వచ్చిన ప్రతికూల అంశాల ప్రభావంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్ లో పెట్టుబడిదారులు ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు, కొంత మేర కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 53.06 పాయింట్ల లాభంతో, 25,656 వద్ద నమోదవుతుండగా..నిఫ్టీ 15.50 పాయింట్ల లాభంతో 7864.40 గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో మెటల్, ఫార్మా షేర్లు లాభాలను పండిస్తున్నాయి. ఈ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 2.3 శాతం పైగా లాభాల్లో నడిచాయి. టాటా పవర్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్, టాటా స్టీల్ కూడా లాభాలనే నమోదుచేస్తున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల పాలైన బ్యాంకింగ్ షేర్లు తర్వాత కొంత పుంజుకున్నాయి. ముందస్తు అంచనాలకు భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి లోనైన ఇన్వెస్టర్లు నిన్నటి స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాలు జరిపి అతిపెద్ద పతనానికి కారణమైన సంగతి తెలిసిందే. మరోవైపు మార్కెట్లో బంగారం, వెండి లాభాల్లో నడుస్తున్నాయి. బంగారం 319 పాయింట్ల లాభంతో 30 వేల వద్ద నమోదవుతుండగా, వెండి 686 పాయింట్ల రేజ్ లో 41,710 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.51గా ఉంది.