ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ బడ్జెట్ సందడి కొనసాగడంతో సెన్సెక్స్ సూచీ తొలిసారి 50 వేల శిఖరస్థాయి పైన ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా జీవితకాల గరిష్ట స్థాయిపై స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరిని ప్రదర్శించడం లాంటి అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 50,256 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 14,790 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్, ఆర్థిక, ఫార్మా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్లు జరిగాయి. సిమెంట్, ఎఫ్‌ఎంసీజీ స్టాకుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకొని నష్టాలను చవి చూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు కొంత నష్టాలను చవిచూసినప్పటికీ.., ఆ తర్వాత తమ జోరును కనబరిచాయి.
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా మార్కెట్ ముగింపు వరకు సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ఒక దశలో సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 50,526 వద్ద, నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 14,869 వద్ద తమ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు చరిత్రాత్మక మైలురాళ్లను అధిగమించిన నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు రూ.1.84 లక్షల కోట్లను ఆర్జించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.198.45 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక పైసా స్వల్ప లాభంతో ఫ్లాట్‌గా ముగిసింది.
‘‘బడ్జెట్‌లో మూలధన ప్రణాళికలకు అధిక వ్యయాన్ని కేటాయించారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల నుంచి మద్దతు లభిస్తోంది. శుక్రవారం వెలువడే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం రానున్న రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానుంది’ అని రియలన్స్ సెక్యూరిటీస్ హెడ్ స్ట్రాటజీ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు.
లిస్టింగ్‌లో మురిపించినా, ఫ్లాట్ ముగింపే..!
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ... లిస్టింగ్ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైంది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.518)తో పోలిస్తే ఈ షేరు 18% ప్రీమియంతో రూ. 612 వద్ద లిస్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 23.45 శాతం ర్యాలీ చేసి రూ. 639.50 స్థాయికి ఎగిసింది. షేరు దూసుకెళ్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అనూహ్యంగా లాభాల స్వీకరణ జరిపారు. ఫలితంగా చివరికి 1.81% స్వల్ప లాభంతో రూ.527.40 వద్ద ముగిసింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► రిలయన్స్ రిటైల్‌తో కుదుర్చుకున్న ఒప్పంద విషయంలో యథాస్థితిని కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం నష్టపోయింది.
► క్యూ3 మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం లాభపడింది.
► ఇండస్‌ఇండ్ బ్యాంకు 7 శాతం లాభపడి తొలిసారి రూ.1000పైన ముగిసింది.
► టాటా మోటార్స్ షేరు 3% లాభపడటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లను అధిగమించింది.
► మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ షేరు రూ.622 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 1.60 శాతం లాభంతో రూ.609 వద్ద స్థిరపడింది.
50,000 శిఖరంపైకి సెన్సెక్స్
Published Thu, Feb 4 2021 4:49 AM | Last Updated on Thu, Feb 4 2021 4:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment