ఎఫ్‌ఐఐలకు మ్యాట్‌పై షా కమిటీ నివేదిక
న్యూఢిల్లీ : విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ)కు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) వర్తింపచేసే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన జస్టిస్ ఏపీ షా కమిటీ గురువారం తమ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. పరిశ్రమ వర్గాలు, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు, ప్రముఖ న్యాయవాదులు మొదలై వారందరి అభిప్రాయాలను తెలుసుకుని 66 పేజీల నివేదికను రూపొందించినట్లు షా తెలిపారు. అయితే, నివేదికలో అంశాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, ప్రభుత్వం రిపోర్టును పరిశీలించి, త్వరలో తగు నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు.
కేంద్రం పూర్తిగా పరిశీలించి, ఆమోదించే దాకా నివేదికలో అంశాలను బహిర్గతపర్చబోదని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరాల క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి రూ. 602.83 కోట్ల మేర మ్యాట్ బకాయిలు కట్టాలంటూ 68 ఎఫ్‌ఐఐలకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మ్యాట్ నోటీసులపై క్యాజిల్‌టన్ తదితర ఎఫ్‌ఐఐలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్‌కు పూర్వం ఎఫ్‌ఐఐలపై మ్యాట్ విధింపు అంశాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం మేలో లా కమిషన్ చైర్మన్ ఏపీ షా సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. క్యాజిల్‌టన్ కేసు సుప్రీంకోర్టులో ఆగస్టు 4న విచారణకు రానున్నందున అంతకు ముందుగానే ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.