
ఆరోగ్య బీమా తీసుకోవాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్..
జీవితం క్లిష్టమైనది. ఇందులో సుఖం, బాధ, కష్టం, నష్టం, లాభం ఇలా ఎన్నో అంశాలుంటాయి. మీ కోసం, మీపై ఆధారపడి జీవనం సాగించే వారి కోసం ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలి. ఇది జీవిత బీమా మాదిరిగానే మిమ్మల్ని నమ్ముకున్న వారికి కష్ట కాలంలో అండగా ఉంటుంది. సాధారణంగా అయితే జీవిత బీమా పాలసీ కన్నా ముందే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఎందుకంటే అస్వస్థత అనేది తరచుగా వస్తుంటుంది కనక. మారుతున్న పర్యావరణ పరిస్థితు లు,మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి తదితర అంశాల కారణంగా ఆనారోగ్యాలు తరచూ సంభవిస్తున్నాయి.
మనం అస్వస్థతకు గురైనపుడు దాని ట్రీట్‌మెంట్‌కు ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. అలాంటి సమయంలో ఆరోగ్య బీమా దన్నుగా నిలుస్తుంది. ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బీమా కంపెనీలున్నాయి. అవి పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. బీమా కంపెనీ, దాని పనితీరు, కవరేజ్ మొత్తం, మన అవసరాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ఒక మంచి పాలసీని ఎంచుకోండి.