భారత టూరిస్టులపై విదేశాల కన్ను! | Singapore upbeat on more tourist arrivals from India | Sakshi
Sakshi News home page

భారత టూరిస్టులపై విదేశాల కన్ను!

Published Thu, Jul 20 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

భారత టూరిస్టులపై విదేశాల కన్ను!

భారత టూరిస్టులపై విదేశాల కన్ను!

గతేడాది శ్రీలంకకు 3.5 లక్షల మంది
ఈ ఏడాది రెండంకెల వృద్ధి అంచనా
సింగపూర్‌కు వెళ్లింది 11 లక్షల మంది
దక్షిణాఫ్రికాలోనూ లక్ష మంది షికారు
మరింత వృద్ధిపై టూరిజం బోర్డుల అంచనాలు  


పర్యటన కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. గతేడాది పొరుగునున్న శ్రీలంకకు 20 లక్షల మంది, సింగపూర్‌కు 10 లక్షల మంది వెళ్లగా... సుదూరాన ఉన్న దక్షిణాఫ్రికాకు సైతం లక్ష మంది వరకూ వెళ్లారు. ఈ ఏడాది వీరి సంఖ్య మరింత వృద్ధి చెందవచ్చని ఆయా దేశాల టూరిజం బోర్డులు అభిప్రాయపడ్డాయి. బుధవారమిక్కడ ఆయా దేశాల టూరిజం బోర్డుల ప్రతినిధులు విలేకరులతో ఏం చెప్పారంటే...– హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

20% వృద్ధిపై శ్రీలంక టూరిజం బ్యూరో అంచనా
ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యలో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్లు శ్రీలంక టూరిజం ప్రమోషన్‌ బ్యూరో డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ డిసిల్వా చెప్పారు. గతేడాది మొత్తం 20 లక్షల మంది పర్యాటకులు రాగా, వారిలో 3.56 లక్షల మంది భారత్‌ నుంచి వచ్చారని చెప్పారు. ఈసారి టూరిస్టుల సంఖ్యలో 20% పైగా వృద్ధి ఉండొచ్చని.. ఇం డియా నుంచి 4.5 లక్షల మంది వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో ఐదు రోడ్‌షోలు తలపెట్టామని, హైదరాబాద్‌తో కలిపి నాలుగు పూర్తయ్యాయని చెప్పారు. పుణేలో మరో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాలు, ఎగ్జిబిషన్స్‌ మొదలైన ఈవెంట్స్‌ నిర్వహణకు, వివాహ వేడుకలకు, సినిమా షూటింగ్‌లకు భారత్‌ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. భారత్‌ నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు కూడా వారానికి 150కి పెరిగాయని, ఇటీవలే హైదరాబాద్‌ నుంచీ విమాన సేవలు మొదలయ్యాయని డిసిల్వా తెలియజేశారు.

లక్ష మంది దాటొచ్చు: దక్షిణాఫ్రికా
భారత్‌ నుంచి ఈ ఏడాది వచ్చే పర్యాటకుల సంఖ్య లక్ష దాటుతుందని దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ అంచనా వేసింది. 2016లో తమ దేశాన్ని 95,377 మంది సందర్శించారని దక్షిణాఫ్రికా టూరిజం ఇండియా మేనేజర్‌ హన్నెలి స్లాబర్‌ తెలిపారు. 2015 కన్నా ఇది 21.7 శాతం అధికమని చెప్పారు. సందర్శకుల సంఖ్య పరంగా భారత్‌ 8వ స్థానంలో ఉందన్నారు. ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ, తెలంగాణ శాఖ చైర్మన్‌ రామిడి అజయ్‌ కుమార్‌తో కలిసి బుధవారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. భారత పర్యాటకుల్లో హైదరాబాద్‌ వాటా ప్రస్తుతం 5 శాతముందని, ఏడేళ్ల క్రితం ఇది 2 శాతమేనని వివరించారు. అడ్వెంచర్‌ టూర్లకు హైదరాబాదీలు అధికంగా వెచ్చిస్తారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు.

ఖర్చులో భారతీయులది 3వ స్థానం: సింగపూర్‌
పర్యాటకానికి ఖర్చు చేయటంలో చైనా, ఇండోనేసియా తర్వాతి స్థానం భారతీయులదేనని సింగపూర్‌ టూరిజం బోర్డు తెలిపింది. 2016 జనవరి–సెప్టెంబర్‌ మధ్య భారతీయులు సింగపూర్‌ సందర్శనకు రూ.5,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అంతకు ముందటి సంవత్సరంతో పోలిస్తే సగటున 26 శాతం పెరిగినట్లు లెక్క. 2016లో విదేశాల నుంచి 1.64 కోట్ల మంది సింగపూర్‌లో అడుగుపెట్టగా వీరిలో భారత్‌ నుంచి వెళ్లిన వారు 11 లక్షల మంది. ఈ ఏడాది ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు బోర్డు ప్రాంతీయ డైరెక్టర్‌ జి.బి.శ్రీధర్‌ తెలిపారు. 2017 జనవరి–ఏప్రిల్‌లో 3.5 లక్షల మంది సింగపూర్‌ను సందర్శించారన్నారు. సింగపూర్‌ నుంచి క్రూయిజ్‌లో లక్ష మందికిపైగా భారతీయులు పలు సందర్శనీయ స్థలాలను చుట్టివస్తున్నట్టు తెలియజేశారు. సందర్శకులను ఆకట్టుకోవడానికి తమ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement