స్మార్ట్ బ్యాం‘కింగ్’ ఎస్‌బీఐ.. | smart banking to sbi | Sakshi
Sakshi News home page

స్మార్ట్ బ్యాం‘కింగ్’ ఎస్‌బీఐ..

Published Wed, Jan 7 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

స్మార్ట్ బ్యాం‘కింగ్’ ఎస్‌బీఐ..

స్మార్ట్ బ్యాం‘కింగ్’ ఎస్‌బీఐ..

మొబైల్ లావాదేవీల సంఖ్యలో ఫస్ట్
విలువలో మాత్రం హెచ్‌డీఎఫ్‌సీదే మొదటి స్థానం

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్‌ఫోన్లతో పాటు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలూ మంచి జోరుమీదున్నాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. జూన్‌తో పోలిస్తే అక్టోబర్ నాటికి హెచ్‌డీఎఫ్‌సీ లావాదేవీల్లో ఐదు రెట్ల వృద్ధి నమోదు కావడమే కాకుండా, ఐసీఐసీఐ బ్యాంక్‌ని తోసిరాజని మొదటి స్థానాన్ని ఆక్రమించింది. జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలు రూ.795 కోట్లు కాగా అక్టోబర్ నాటికి రూ. 3,540 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,021 కోట్ల నుంచి రూ.1,416 కోట్ల మార్కును అందుకుంది. ఇంతకాలం లావాదేవీల సంఖ్యలో ఐసీఐసీఐ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండేది. అక్టోబర్లో యాక్సిస్ బ్యాంక్‌లో రూ.1,036 కోట్ల విలువైన మొబైల్ లావాదేవీలు జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్సిడ్, రికరింగ్ డిపాజిట్లు, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని బీమా, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన 75 రకాల సేవలను అందిస్తున్నామని, ఈ సంఖ్యను త్వరలోనే 90కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ లావాదేవీల్లో 55 శాతం డిజిటల్ చానల్స్ ద్వారానే జరుగుతున్నాయి.
 వెనుకబడ్డ పీఎస్‌బీలు: మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు బాగా వెనుకబడి ఉన్నాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగిలిన పీఎస్‌బీల్లో చెప్పుకోదగ్గ లావాదేవీలు జరగడం లేదు.

ఈ సమీక్షా కాలంలో ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు విలువ రూ.546 కోట్ల నుంచి రూ.877 కోట్లకు పెరిగింది. కానీ లావాదేవీల సంఖ్యలో మాత్రం ఎస్‌బీఐదే మొదటి స్థానం. గడిచిన 12 నెలల్లో లావాదేవీల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే  46%వృద్ధితో 86 లక్షల నుంచి 1.25 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ద్వారా పరిమితమైన లావాదేవీలనే అందిస్తున్నామని, త్వరలోనే పేమెంట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం సగటు లావాదేవీ విలువ రూ.7,052గా ఉందని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారామె. ప్రస్తుతం దేశంలో 90 కోట్ల మందికి మొబైల్ ఫోన్లుండగా అందులో 4 కోట్ల మందే మొబైల్ బ్యాంకింగ్‌ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 1.62 కోట్లమంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా, ఈ సంఖ్య 2020 నాటికి 6.25 కోట్లకు చేరుతుందని అంచనా.
 
2014లో మొబైల్ బ్యాంకింగ్ ఇలా...
 
బ్యాంక్ పేరు    జూన్    అక్టోబర్
హెచ్‌డీఎఫ్‌సీ    795    3,540
ఐసీఐసీఐ బ్యాంక్    1,021    1,416
యాక్సిస్ బ్యాంక్    586    1,036
ఎస్‌బీఐ    546    877
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement