
చేతిలోనే ఐదారు నిమిషాల్లో ఛార్జింగ్..
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అయిపోతుందని మీకెప్పుడైనా అనిపించిందా? పవర్‌బ్యాంక్ చేతిలో ఉన్నా.. మనలో చాలామందికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి కలిగే ఉంటుంది. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఆ బుల్లి బాల్ లాంటి గ్యాడ్జెట్ మన చేతిలో ఉందంటే మాత్రం ఛార్జింగ్ చింత రానేరాదు. ఆ గ్యాడ్జెట్‌ను చేతిలో పట్టుకుని అలా అలా... చేతిలో తిప్పుతూ ఉంటే చాలు... ఐదారు నిమిషాల్లో మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేంత కరెంట్ అక్కడికక్కడే ఉత్పత్తి అవుతుంది. బ్యాటరీలోకి చేరిపోతుంది. ‘అదెలా సాధ్యం’ అంటున్నారా? చాలా సింపుల్.
దీంట్లో అయస్కాంతపు రోటర్, ఓ స్టార్టర్ (ఇండక్షన్ మోటర్లలో ఉండే స్ప్రింగ్ లాంటి పరికరం), వెయ్యి ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. బాల్‌పై ఉండే చిన్న రింగ్‌ను మెలితిప్పి వదిలేస్తే చాలు. ఇవి పనిచేయడం మొదలుపెడతాయి. చేతితో బాల్‌ను గిరగిరా తిప్పుతూ ఉంటే, లోపలి రోటర్ నిమిషానికి 5 వేల సార్లు తిరుగుతూ ఉంటుంది. తద్వారా అయిదు వాట్ల/ఒక ఆంపియర్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికే ఈ హైటెక్ గ్యాడ్జెట్ నమూనాలు సిద్ధమైపోయాయి. మరికొన్ని నిధులు సమకూరితే మార్కెట్‌లోకి తెచ్చేస్తామంటున్నారు దీని సృష్టికర్తలు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఆరు నెలల్లో ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.